Begin typing your search above and press return to search.

అంత ‘కూల్ కెప్టెన్’కూ కన్నీళ్లు వచ్చేశాయట!

By:  Tupaki Desk   |   17 Aug 2020 5:30 PM GMT
అంత ‘కూల్ కెప్టెన్’కూ కన్నీళ్లు వచ్చేశాయట!
X
మహేంద్ర సింగ్ ధోనీ... జార్ఖండ్ డైనమైట్ అని అతడి అభిమానులు ఎంత ముద్దుగా పిలుచుకున్నా... యావత్తు క్రీడాలోకం అతడిని కెప్టెన్ కూల్ గానే పరిగణిస్తోంది. అంటే ఆటలో ఎంతటి భావోద్వేగాలు వ్యక్తమైనా... అవి సంతోషకమైనవైనా, బాధ కలిగించేవి అయినా కూడా వాటిని తన మోములో కనిపించకుండా మహీ బ్యాలెన్స్ డ్ గా వ్యవహరిస్తాడన్న మాట. అంతటి కూల్ కెప్టెన్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడంటే... అది ఎంతటి భావోద్వేగ సందర్భమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ క్రికెట్ లోనే కాకుండా వరల్డ్ క్రికెట్ లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న ధోనీ... తన రిటైర్మెంట్ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నాడట. అంతేగా... క్రికెట్టే ప్రాణంగా వ్యవహరించిన ఓ మేటి ఆటగాడు.. ఇకపై తాను ఆటకు దూరమవుతున్నానన్న విషయాన్ని జీర్ణించుకోలేక బోరుమని విలపించక తప్పదు కదా.

మహీ నిజంగానే కన్నీళ్లు పెట్టుకున్నాడా? అంటే... అతడికి అత్యంత సన్నిహితుడిగా, అతడు రిటైర్మెంట్ ప్రకటించిన మరుక్షణమే తానూ జెంటిల్మన్ గేమ్ కు వీడ్కోలు పలికిన సురేశ్ రైనానే స్వయంగా ఈ విషయం వెల్లడించాక నమ్మక తప్పదు కదా. అయినా మహీ కన్నీళ్లు పెట్టుకున్న వైనాన్ని రైనా ఎలా వివరించాడన్న విషయంలోకి వెళితే.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్న ధోనీ... ఐపీఎల్ సన్నాహకాల్లో భాగంగా మొన్న చెన్నై చేరుకున్న సంగతి తెలిసిందే కదా. అయితే మొన్న ఆగస్టు 15 నాడు అంతా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మునిగిపోగా... చాలా కూల్ గా మహీ తన రిటైర్మెంట్ ను ప్రకటించేశాడు. ఆ వెంటనే రైనా కూడా తానూ ధోనీ వెంటేనంటై క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.

ఇద్దరూ నిమిషాల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఒకళ్లనొకళ్లు కౌగిలించుకుని ఓదార్పు పొందారట. ఈ సందర్భంగా రైనా కన్నీళ్లు పెట్టుకుంటే... ధోనీ కూడా తనలో రేగుతున్న భావోద్వేగాన్ని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడట. ఆగస్టు 15నాడు ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని రైనాకు ముందే తెలుసట. ధోనీ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ముందూవెనుకా చూసుకోకుండా తాను రిటైర్ కావాలని రైనా నిర్ణయమించుకున్నాడట. ఇంకేముంది ధోనీ నుంచి రిటైర్మెంట్ ప్రకటన రాగానే... రైనా కూడా క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. ఈ సందర్బంగానే ధోనీ.. రైనాను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడట. ఆ తర్వాత కాస్తంత సాంత్వన పొందిన వారిద్దరూ రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులతో రాత్రి పొద్దుపోయేదాకా తమ మధుర జ్ఝాపకాలను నెమరు వేసుకున్నారట.