Begin typing your search above and press return to search.

మనపై వాడు సర్జికల్ అటాక్స్ చేశామంటున్నాడు

By:  Tupaki Desk   |   14 Jan 2017 11:19 AM IST
మనపై వాడు సర్జికల్ అటాక్స్ చేశామంటున్నాడు
X
ఒళ్లంతా విషం పెట్టుకొనే దాయాదిలో భాగమైన లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహ్మమద్ సయిద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పై తాము సర్జికల్ అటాక్స్ కు పాల్పడినట్లుగా బీరాలు పలుకుతున్నాడు. నలుగురు పాకిస్థానీ ముజాహిదీన్ కమాండర్ల కనుసన్నల్లో ఈ దాడి జరిగినట్లుగా చెప్పుకొచ్చాడు. దారుణమైన వ్యాఖ్యలు చేసిన వాడు.. మన సైన్యానికి చెందిన 30మందిని చంపేసినట్లుగా చెప్పుకొచ్చాడు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ముజఫరాబాద్ లోని జమాత ఉద్ దవాకి చెందిన వందలాది మందిని ఉద్దేశించిన ప్రసంగించిన అతగాడు.. భారత్ ను అవమానించేలా పలు వ్యాఖ్యలు చేశాడు. అతగాడి ప్రసంగంలోని రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియో టేపు ఒకటి బయటకు వచ్చింది. ఈ టేపులో తాము భారత సైనిక శిబిరంపై దాడికి పాల్పడినట్లుగా వెల్లడించాడు.

నియంత్రణ రేఖకు రెండు కిలోమీటర్ల దూరంలోని అక్నూర్ లోని భారత సైనిక శిబిరం మీద నలుగురితో కూడిన బృందం సర్జికల్ దాడులకు పాల్పడిందని వ్యాఖ్యానించాడు. ‘అసలైన సర్జికల్ దాడి అంటే ఇదే. నలుగురు వెళ్లి.. 30 మంది ప్రాణాలు తీశారు. మనవారిలో ఏ ఒక్కరికి చిన్న గాయం కూడా కాలేదు . భారతదేశం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ కు అసలుసిసలు సమాధానం ఇది. భారత ప్రధాని మోడీ చేయించిన సర్జికల్ దాడులకు సమాధానం ఇవ్వటం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వల్ల కాలేదు. అందుకే నేనే సమాధానం ఇచ్చా’ అని బలుపు వ్యాఖ్యలు చేశాడు.

అయితే.. హఫీజ్ వ్యాఖ్యాల్ని భారత సైనిక వర్గాలు తీవ్రంగా ఖండించాయి. అక్నూర్ లో పటిష్ట భద్రత ఉంటుందని.. ఇక్కడికి వచ్చిన వారు తిరిగి వెళ్లటం సాధ్యమయ్యే పని కాదని వారు స్పష్టం చేస్తున్నారు. సర్జికల్ దాడులు జరిగాయని చెప్పటంలో అస్సలు నిజం లేదని తేల్చిచెబుతున్నారు. అక్నూర్ ఘటనలో ముగ్గురుకూలీలు మృతి చెందిన మాట వాస్తవమేనని.. సైనికులు ఒక్కరుకూడా చనిపోలేదని స్పష్టం చేస్తున్నారు. మాటలతో తెగబడుతున్న హఫీజ్ కు బలమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం భారత్ పైన ఉంది. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న అతడి నోటికి శాశ్వితంగా తాళం వేసే దిశగా భారత్ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/