Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే నపుంసకులవుతారా? .. కేంద్రం స్పందన ఇదే !

By:  Tupaki Desk   |   15 Jan 2021 6:52 AM GMT
కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే నపుంసకులవుతారా? .. కేంద్రం స్పందన ఇదే !
X
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ‌కు సర్వం సిద్ధమైంది. రేపు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. అయితే , వ్యాక్సినేషన్‌ కు సంబంధించి అన్నిరాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో కీలకమైన అంశాలను ప్రస్తావించింది. కరోనా వ్యాక్సిన్ ‌కు ఎవరికి వేయాలి, ఎవరికి వేయొద్దు, వ్యాక్సిన్ తీసుకున్నాక వచ్చే సమస్యలు ఏంటి, వ్యాక్సినేషన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా సూచనలు చేసింది. అయితే , కరోనా టీకాలపై ప్రజల్లో అనేక అపోహలు, అనుమానాలు నెలకున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. టీకా వేయించుకున్న కొద్దిమందిలో దుష్ప్రభావాలు తలెత్తడంతో పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. ప్రజల్లో టీకా పై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేసింది.

ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.కరోనా టీకా వేయించుకున్నవారికి వంధత్వం ఏర్పడుతుందని జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. కోవిడ్ టీకాతో నపుంసకులు అవుతారంటూ ఇటీవల ఒక రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఖండించారు. కరోనా టీకా కారణంగా మహిళలు గానీ, పురుషులు గానీ నపుసంకులు అవుతారనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు.

అయితే, కరోనా టీకా తీసుకున్న తరువాత కొద్దిమందిలో స్వల్ప జ్వరం, వ్యాక్సిన్ ఇచ్చిన ప్రాంతంలో నొప్పి ఉండటం సాధారణమని అన్నారు. ఇతర టీకాలు వేయించుకున్నప్పుడు కూడా ఇదేవిధంగా జరుగుతుందని, కొద్ది సేపటిలోనే ఇటువంటి సమస్యలు మాయయవుతాయని అన్నారు. కాగా, ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియకు భారత్ శ్రీకారం చుడుతోందని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా టీకాలు వేయనున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 2934 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజధానుల నుంచి ఆయా కేంద్రాలకు టీకాలను తరలించారు. టీకా కేంద్రాల్లో సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభ రోజున దేశవ్యాప్తంగా సుమారు.. 3 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తారని తెలుస్తోంది. ఒక్కో కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్ వేస్తారు. తొలి దశలో ఫ్రంట్‌ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ లు ఇచ్చాక.. రెండో దశలో 50 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి టీకాలు వస్తారు. ప్రస్తుతానికి కొవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్‌లలో తమకు నచ్చిన టీకాను ఎంచుకునే అవకాశం లేదు. కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఏది అందుబాటులో ఉంటే దాన్నే వేసుకోవాలి.