Begin typing your search above and press return to search.

మోడీ బ్యాచ్ పై మ‌మ‌త తీవ్ర వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   21 Jun 2018 10:49 AM GMT
మోడీ బ్యాచ్ పై మ‌మ‌త తీవ్ర వ్యాఖ్య‌లు
X
ఈ మ‌ధ్య‌న ముగిసిన నీతి ఆయోగ్ స‌మావేశానికి సంబంధించి మీడియా క‌వ‌రేజ్ చూశారా? ఆ సంద‌ర్భంగా ప్రింట్ చేసిన ఫోటోల్లో ఒక ఫోటో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. మోడీ అంటేనే విరుచుకుప‌డే ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. ఈ మ‌ధ్య‌న ప్రధానిపై అదే ప‌నిగా విరుచుకుప‌డుతున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో పాటు.. మోడీకి దూరంగా ఉండే క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రితో పాటు.. అదే ఫ్రేంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కేర‌ళ ముఖ్యమంత్రి ఉన్నారు.

ఈ ఫోటోలో మిగిలిన వారితో పోలిస్తే.. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి దీదీ.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఫోజులు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించాయి. బ‌య‌ట స‌భ‌ల్లో మోడీ అంటే విరుచుకుప‌డే బాబు.. ప్ర‌ధాని ముందు మాత్రం విన‌యంగా ఆయ‌న హావ‌భావాలు.. బాడీ లాంగ్వేజ్ ఉంటే.. దీదీ మాత్రం హుందాగా ఉండ‌టం.. మోడీకి దూరంగా ఉంటూనే..ఎంత మేర ఫ్రెండ్లీగా ఉండాలో అంతే మేర అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు.

ఈ ఫోటోలు వ‌చ్చిన వారం కూడా కాక ముందే క‌ల‌క‌త్తా కాళిగా మారి మోడీ ప‌రివారంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ప‌శ్చిమ‌బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్య‌ల‌పైనా విరుచుకుప‌డుతూ.. మోడీ బ్యాచ్ మొత్త‌మ్మీదా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీదీ పార్టీకి చెందిన నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు కొంద‌రు కండ‌లు పెంచి బెదిరిస్తున్నార‌ని.. అలాంటి వారు జైలుకైనా వెళ్లాలి.. లేదంటే నేరుగా అయినా త‌మ‌తో త‌ల‌పడాలన్నారు. అంతేకాదు.. త‌మ కార్య‌క‌ర్త‌ల్ని చంపుతుంటే బుల్లెట్ల‌ను లెక్కించాల్సి ఉంటోంద‌ని మాట మీరారు.

దీనిపై స్పందించిన మ‌మ‌త బీజేపీ మాదిరి త‌మ‌ది మిలిటెంట్ సంస్థ కాద‌ని.. కేవ‌లం క్రిస్టియ‌న్లు.. ముస్లింల మ‌ధ్యే గొడ‌వ‌లు సృష్టించ‌టం లేద‌ని.. హిందువుల మ‌ధ్య కూడా కొట్లాట‌లు పెడుతున్నారంటూ విరుచుకుప‌డ్డారు. బీజేపీ పార్టీని మిలిటెంట్ సంస్థ‌గా అభివ‌ర్ణిస్తూ మ‌మ‌త చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. మాట‌కు మాట కాకుండా.. మాట‌కు రెండు మాట‌ల‌న్న‌ట్లుగా దీదీ వ్య‌వ‌హ‌రిస్తున్న వైఖ‌రి ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.