Begin typing your search above and press return to search.

ఇంట్లో ఉండే మీరు యుద్ధం చేస్తున్నారన్న విషయం మీకు తెలుసా?

By:  Tupaki Desk   |   27 March 2020 2:30 AM GMT
ఇంట్లో ఉండే మీరు యుద్ధం చేస్తున్నారన్న విషయం మీకు తెలుసా?
X
దేశంలోని చాలామంది ప్రజలకు అర్థం కానిది ఇప్పుడు మనం యుద్ధం చేస్తున్నాం. ఇప్పుడు బతికి ఉన్న వారిలో ఎవరూ కూడా ప్రపంచ యుద్ధాన్ని చూసినోళ్లు లేరనే చెప్పాలి. ఒకవేళ.. వేళ్ల మీద లెక్కేసేటోళ్లు ఉన్నా.. వారెవరికి అప్పటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏం జరిగిందన్న విషయం మీద అవగాహన తక్కువే ఉండొచ్చు. పెరిగిన సాంకేతికతతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికిప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంది. అప్పట్లో అది లేదు. కానీ.. చిత్రమైన విషయం ఏమంటే.. టెక్నాలజీ ఇంత పెరిగినా.. ప్రజల్లో మాత్రం కరోనా కారణంగా ఎంత ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని చాలామంది సీరియస్ గా తీసుకోవటం లేదు.

చిన్న చిన్న విషయాలకే ఇంట్లోని బయటకు వస్తూ.. లాక్ డౌన్ స్ఫూర్తిని దారుణంగా దెబ్బ తీస్తున్నారు. చాలామందికి ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ అదేదో పండుగ సెలువులుగా భావిస్తున్నారే తప్పించి.. ఒక ప్రమాదకరమైన వైరస్ మీద యుద్ధం చేసేందుకన్న విషయాన్ని గుర్తించట్లేదు. శత్రువుల మీద యుద్ధం చేసే సమయంలో రోడ్ల మీదకు వచ్చి.. సరిహద్దుల్లోకి వెళ్లి యుద్ధం చేయాలి. కానీ.. కంటికి కనిపించని వైరస్ మీద యుద్ధం చేస్తున్నప్పుడు.. ఇంట్లో ఉంటే సరిపోతుందన్నది మర్చిపోకూడదు.

ఎవరింట్లో వారు ఉండి.. బయటకు రాకుండా ఉండటం కూడా వైరస్ మీద యుద్ధం చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు ఇంట్లో నుంచి బయటకు రాకపోవటం ఒక శిక్ష అయితే.. బయట ఉండే శత్రువు నుంచి కాపాడుకోవటానికి ఆయుధాలు పట్టుకొని ఉండకుండా.. ఎంచక్కా ఇంట్లోని ఫ్యాను కింద కూర్చొని.. టీవీ చూస్తూ.. ఎంతో ఇష్టమైన వారితో కాలక్షేపం చేయటం కూడా యుద్ధమే. అలాంటివేమీ చేయకుండా బయటకు అడుగు పెట్టిన ప్రతిసారీ.. ఇంట్లోకి బయట నుంచి సామాన్లు తీసుకున్న ప్రతి సందర్భంలోనూ పిశాచి ని ఇంట్లోకి వెల్ కం చెప్పినట్లే అవుతుందన్న విషయాన్ని మీరు గుర్తిస్తున్నారా?