Begin typing your search above and press return to search.

రూ.ల‌క్ష కోట్లు కేంద్రం దారి మ‌ళ్లించిందట‌!

By:  Tupaki Desk   |   11 April 2018 5:58 AM GMT
రూ.ల‌క్ష కోట్లు కేంద్రం దారి మ‌ళ్లించిందట‌!
X
దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానానికి ఆగ్ర‌హం క‌లిగింది. తమ ఆదేశాల్ని ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న మోడీ స‌ర్కారు తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. దాదాపు రూ.ల‌క్ష కోట్ల రూపాయిల్ని ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం వాడాల్సి ఉంటే.. వాటిని రోడ్లు.. విద్యుత్ స్తంభాలు లాంటి వాటి కోసం ఖ‌ర్చు చేయ‌టంపై తీవ్ర‌స్వ‌రంతో ప్ర‌శ్నించింది.

అడ‌వుల్ని కొట్టేసిన దానికి బ‌దులుగా మ‌రోచోట అడ‌వుల్ని పెంచేందుకు వేలాది కోట్ల రూపాయిలు వ‌చ్చేలా సుప్రీం గ‌తంలో ఆదేశాలు ఇచ్చింది. ఇలా ఇచ్చిన ఆదేశాల కార‌ణంగా దాదాపుగా రూ.ల‌క్ష కోట్ల మేర‌కు ప్ర‌భుత్వ ఖ‌జానాకు చేరే అవ‌కాశం ఉంది. అయితే.. ఈ మొత్తాన్ని ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం కాకుండా ఇత‌ర అవ‌స‌రాల కోసం ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసింది. ఈ విష‌యం తాజాగా సుప్రీం విచార‌ణ‌లో స్ప‌ష్ట‌మైంది.

దీంతో.. తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్త చేసిన సుప్రీంకోర్టు కేంద్రంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుతాం.. ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తామ‌ని త‌మ‌కు హామీ ఇచ్చార‌ని.. కానీ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం ఖ‌ర్చు చేయాల్సిన నిధుల్ని ఇత‌ర ప‌నుల కోసం ఖ‌ర్చు చేయ‌టం ఏమిట‌ని? ప‌్ర‌శ్నించారు.

తాము ప‌లు సంద‌ర్భాల్లో ఇచ్చిన ఉత్త‌ర్వుల ఆధారంగా వ‌చ్చిన నిధుల్ని.. ప్ర‌భుత్వం ఇత‌ర అవ‌స‌రాల కోసం ఖ‌ర్చు చేయ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నించింది. "మీరు మా న‌మ్మ‌కాన్ని దెబ్బ తీశారు. ఈ ద్రోహానికి పాల్ప‌డిన వారిని ప‌ట్టుకోవాలి. మేమేమీ పోలీసులం కాదు. ద‌ర్యాప్తు అధికారుల‌మూ కాదు. కోర్టులు ఇంకా ఎంత దూరం వెళ్లాలి. మాకు న‌చ్చిన‌ట్లు మేం చేసుకుంటామ‌ని అనుకుంటున్నారు. మాకు నిరాశా.. నిస్పృహ క‌లుగుతున్నాయి. మ‌మ్మ‌ల్ని వెర్రోళ్ల‌ను చేస్తున్నారు" అంటూ జ‌స్టిస్ మ‌ద‌న్ లోకూర్.. జ‌స్టిస్ దీప‌క్ గుప్తాల బెంచ్ తీవ్రంగా మండిప‌డింది.

కొట్టేసిన అడ‌వుల‌కు బ‌దులుగా వేరే చోట అడువులు పెంచ‌టం కోసం రూ.11700 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి లెక్క చూస్తే.. రాష్ట్రాల‌తో క‌లిపి దాదాపు రూ.ల‌క్ష కోట్ల రూపాయిల వ‌ర‌కూ ఉండే వీలుంది. కానీ.. ఆ మొత్తం నిధుల్ని వేరే వాటి కోసం వినియోగించిన వైనాన్ని గుర్తించిన సుప్రీం ప్ర‌శ్నించింది. తాము ప్ర‌భుత్వ త‌ప్పుల్ని ఎత్తి చూపితే.. కోర్టులు త‌మ ప‌రిధిని దాటుతున్నాయంటూ విమ‌ర్శ‌లు చేస్తార‌ని.. మితిమీరిన జోక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాయ‌ని చెబుతార‌ని.. కానీ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం వినియోగించాల్సిన నిధుల్ని రోడ్ల నిర్మాణం.. బ‌స్టాండ్లను న‌వీక‌రించ‌టం.. కాలేజీల్లో సైన్స్ ప్ర‌యోగ‌శాల‌ల నిర్మాణానికి భారీ మొత్తాల్ని ఖ‌ర్చు చేసిన‌ట్లుగా సుప్రీం గుర్తించింది. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన అత్యున్న‌త న్యాయ‌స్థానం.. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ నిధుల్ని ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నం కోసం ఖ‌ర్చు చేయాలే కానీ ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నం కోసం కాద‌ని స్ప‌ష్టం చేసింది. అస‌లు ఎంత డ‌బ్బు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం ఉందో నివేదిక ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని సుప్రీం బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.