Begin typing your search above and press return to search.

మన డేటాను రూ.100కే అమ్మేస్తున్నారు.!

By:  Tupaki Desk   |   10 Oct 2019 1:30 AM GMT
మన డేటాను రూ.100కే అమ్మేస్తున్నారు.!
X
మనకు కోట్ల లాటరీ తగిలిందని కొందరు.. మీ బ్యాంకు ఖాతాలో సమస్య ఉందని మరికొందరు ఫోన్ చేసి మన వివరాలు అడుగుతుంటారు. అసలు మనకు తెలియని వారికి మన ఫోన్ నంబర్లు - బ్యాంకుల వివరాలు ఎలా తెలిశాయన్నది మనకు అంతుచిక్కని ప్రశ్న. అయితే ఇందుకు కారణం మనం ఉదాసీనంగా ఇచ్చేసే మన వివరాలని ఓ పరిశోధనలో తేలింది.

రెస్టారెంట్లు - షాపింగ్ మాల్స్ సహా ఆన్ లైన్ లో ఏదైనా ఆఫర్ల కోసం మన ఫోన్ నంబర్ - మెయిల్ ఐడీలను ఇచ్చేస్తుంటారు. ఆ డేటా మొత్తం మార్కెటింగ్ సంస్థలకు కొందరు అక్రమార్కులు అమ్మేస్తుంటారు. జిరాక్స్ సెంటర్ల వారు కూడా మన జిరాక్స్ లు - దరఖాస్తులు చేసుకునేటప్పుడు మన డేటా సేకరించి అమ్మేస్తారట.. మన ఆధార్ కార్డ్ నుంచి అన్ని కార్డ్ లను వారు సేకరించి ఇలా అమ్మేస్తారని తెలిసింది.

ఇలా కాజేసిన డేటాతో కొందరు అక్రమార్కులు బ్యాంకు మేనేజర్లతో కుమ్మక్కై మనకు తెలియకుండా మన బ్యాంకు ఖాతా నుంచి లోన్లు తీసుకున్నట్టు - ఖాతాలో డబ్బులు కాజేస్తున్నారనే విషయం వెలుగుచూసింది.

ఇక బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులు కూడా థర్డ్ పార్టీలకు వినియోగదారుల డేటా అమ్ముతున్నట్టు తేలింది. వివిధ వ్యక్తులకు కేటాయించిన క్రెడిట్ - డేబిట్ కార్డ్ లు - ఇతర వివరాలను అమ్మేస్తున్నారని సమాచారం. దీంతో బ్యాంకు మోసాలు పెరిగిపోతున్నాయని తెలిసింది.

ఇక ఈకామర్స్ వెబ్ సైట్లలో మనం జరిపే కొనుగోళ్ల సమాచారం కూడా కొందరు హ్యాకర్లు పసిగట్టి ఈకామర్స్ సర్వర్ల నుంచి కొనుగోలు దారుల సమాచారం సేకరించి వారిని బురిడీ కొట్టించి మోసం చేస్తున్నట్టు తెలిసింది. కొందరు ఈకామర్స్ ఉద్యోగులు వినియోగదారుల డేటాను అమ్మేస్తున్నట్టు తెలిసింది.

అయితే ఇన్ని మోసాలు జరుగుతున్నా మన టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) వద్ద ఈ మోసాలను బ్లాక్ చేసే వ్యవస్థ లేకపోవడం గమనార్హం. ఇదంతా మనం ఉద్యోగం కోసం.. పెళ్లి కావడం కోసం మ్యాట్రిమోనీల్లో - ఇక నిరుద్యోగులు జాబ్ ల కోసం చేసే దరఖాస్తుల వల్ల వారి డేటా పరుల పరం అయ్యి మోసాలు ఎక్కువ అవుతున్నాయని తెలుస్తోంది. ఇలా కొట్టేసిన డేటా ఆన్ లైన్ లో రూ.100 కే అమ్మేస్తామంటూ చాలా మంది సేకరణ దారులు మోసగాళ్లకు ఆఫర్లు ఇవ్వడం కనిపిస్తోంది. దీన్ని బట్టి మనం మన వివరాలను ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేయడమే మనం మోసపోవడానికి కారణంగా నిపుణులు తేలుస్తున్నారు.