Begin typing your search above and press return to search.

అమేథీలో విజయంపై రాహుల్ భయపడుతున్నారా?

By:  Tupaki Desk   |   23 March 2019 1:15 PM GMT
అమేథీలో విజయంపై రాహుల్ భయపడుతున్నారా?
X
నెహ్రూ-గాంధీ కుటుంబానికి కంచుకోటయిన అమేథీలో ఈసారి కష్టాలు తప్పవా..? కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అక్కడ విజయంపై అనుమానపడుతున్నారా..? అన్న సందేహాలు మొదలవుతున్నాయి. బీజేపీ ఇప్పటికే తాము అమేథీలో రాహుల్‌ ను ఓడిస్తామని చెబుతుండగా కాంగ్రెస్ కూడా అలాంటి భయంతోనే ఉన్నట్లుగా తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఎన్నడూ లేనట్లుగా రాహుల్ గాంధీ ఈసారి అమేథీతో పాటు మరో నియోజకవర్గంలో కూడా పోటీకి సిద్ధమవుతున్నట్లుగా కాంగ్రెస్ నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో.. అమేథీలో ఆయనకు ఎదురుగాలి వీస్తోందన్న భావనకు బలం చేకూరుతోంది.

రాహుల్ గాంధీ ఈసారి అమేథీతో పాటు కేరళలోని వాయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు కేరళ పీసీసీ అధ్యక్షుడు ముళ్లప్పల్లి రామచంద్రన్ శనివారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రణ్‌ దీప్ సింగ్ సూర్జేవాలా శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ - కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేయాలని ఇప్పటికే కేరళ పార్టీ కార్యకర్తలను రాహుల్‌ ను కోరారని - కేరళ ప్రజలు చూపిస్తున్న ప్రేమ - ఆదరణకు పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తోందని చెప్పారు. కార్యకర్తల విజ్ఞప్తిని రాహుల్ సానుకూలంగా పరిశీలించే అవకాశం ఉందని చెప్పారు. కేరళ పీసీసీ ప్రెసిడెంట్ మాత్రం రాహుల్ వాయనాడు నుంచి పోటీకి అంగీకరించినట్లు ప్రకటించారు.

అమేథి నుంచి రాహుల్ పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ ఈనెల ప్రారంభంలో ప్రకటించగా - ఈ నియోజకవర్గం నుంచి స్మృతి ఇరానీని బీజేపీ నిలబెట్టింది. కాగా, తమిళనాడు - కర్ణాటక పార్టీ విభాగాలు సైతం రాహుల్‌ ను తమతమ రాష్ట్రాల నుంచి పోటీ చేయాల్సిందిగా ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి. తాజాగా, కేరళ కాంగ్రెస్ యూనిట్ సైతం రాహుల్‌ను వాయనాడ్ నుంచి పోటీ చేయాల్సిందిగా కోరింది. గత ఏడాది కేరళ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంఐ షానవాజ్ కన్నుమూయడంతో వాయనాడ్ సీటు ఖాళీ అయింది. ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సిద్ధిఖ్ పోటీలో ఉన్నప్పటికీ, రాహుల్ పోటీకి సుగమం చేస్తూ స్వచ్ఛందంగా తప్పుకుంటానని ఆయన ప్రకటించారు. కాగా కర్ణాటక - కేరళ సరిహద్దుల్లో ఉన్న వాయనాడు కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గం కావడంతో రాహుల్ అంగీకరించినట్లు తెలుస్తోంది.