Begin typing your search above and press return to search.

ఎక్కడా తేలనివి.. మీరు మాత్రం తేల్చుకోవటమా కేసీఆర్.. జగన్

By:  Tupaki Desk   |   7 Oct 2020 5:01 AM GMT
ఎక్కడా తేలనివి.. మీరు మాత్రం తేల్చుకోవటమా కేసీఆర్.. జగన్
X
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను ఒక కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ముఖ్యమంత్రులు అవసరానికి మించిన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారా? దేశంలోని ఇతర రాష్ట్రాల అనుభవాల్ని.. ఉదాహరణల్ని మరిచిపోయిన ఈ ఇద్దరు పెద్ద మనషుల తీరు సరిగా లేదన్న మాట వినిపిస్తోంది. ఏ చిన్న అవకాశం వచ్చినా రాష్ట్రాల మీద పెత్తనం వహించేందుకు సిద్ధంగా ఉన్న కేంద్రం తీరును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ తప్పు పడుతుంటారు. అలాంటి ఆయన.. తన తీరుకు భిన్నంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటున్నారు.

నిజంగానే నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రాజెక్టుల్ని నిర్మిస్తుంటే.. చర్చల రూపంలో ఆ రాష్ట్ర సీఎం జగన్ తో మాట్లాడటం మంచిది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో తనకున్న అభ్యంతరాల్ని ఏపీ సీఎం జగన్ ప్రస్తావిస్తే సరిపోయే దానికి.. కేంద్రాన్ని మధ్యలోకి తేవటం గమనార్హం. దేశంలో మరే రాష్ట్రాల మధ్య పంచాయితీలు లేకుండా.. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయితీలు ఉంటే అదో పద్ధతి.

అందుకు భిన్నంగా ప్రతి ప్రాజెక్టుకు ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంటుంది. మరి.. ఆ వివాదాల విషయంలో సదరు రాష్ట్రాలు చూపించని దూకుడు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూపించాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న. ఎక్కడి దాకానో ఎందుకు ఏపీకి చెందిన పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే.. ఇప్పటికే 75 శాతం పూర్తి అయిన ఆ ప్రాజెక్టుకు ఇంకా పలు అనుమతులు రావాల్సి ఉంది. జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ.. అనుమతుల పెండింగ్ మాత్రమే కాదు.. పలు రాష్ట్రాల అభ్యంతరాలు ఉన్నాయి.

అనుమతులన్ని వచ్చిన తర్వాతే ప్రాజెక్టులు నిర్మించుకోవాలన్న మాట కాగితాల్లో చదువుకోవటానికి బాగానే ఉంటుంది కానీ ప్రాక్టికల్ గా సాధ్యం కానిది. పోలవరం విషయానికే వస్తే.. దీనిపై ఛత్తీస్ గఢ్.. ఒడిశాల అభ్యంతరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలా అని పోలవరం ప్రాజెక్టు ఆగలేదు కదా? అంతదాకా ఎందుకు అప్పుడెప్పుడో ఎన్టీఆర్ హయాంలో షురూ చేసిన తెలుగు గంగ ప్రాజెక్టుకు నేటికి పర్యావరణ అనుమతులు రాలేదు.. అయినా ప్రాజెక్టు పూర్తి అయ్యింది.దాని ఫలాలు పొందుతున్నారు. అందుకు భిన్నంగా లెక్కలు అన్ని తేలిన తర్వాతే ప్రాజెక్టుల్ని వినియోగించుకోవాలంటే అర్థం ఉంటుందా?

తాజా అపెక్సు కౌన్సిల్ భేటీలో కేంద్రమంత్రి ఈ తరహా వ్యాఖ్యనే చేశారన్నది మర్చిపోకూడదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల మీద అభ్యంతరాలకు సంబంధించి పూర్తి వివరాల్ని ఇచ్చి కూర్చోవాలని.. తాము పరిశీలించి చెప్పే వరకు ప్రాజెక్టు పనుల్ని ఆపమని చెప్పటం చూస్తే.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తెలివితేటలకు అబ్బుర పడాల్సిందే. ఇద్దరు తెలివైన ముఖ్యమంత్రులు.. తెలివితక్కువగా తమ జుట్టను తీసుకెళ్లి కేంద్రం చేతికి ఇవ్వటంలో అర్థమేమైనా ఉందా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. మరి.. ఈ అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పునరాలోచించుకుంటారా? అన్నది క్వశ్చన్. దానికి ఆన్సర్ ఎప్పుడు వస్తుందో చూడాలి.