Begin typing your search above and press return to search.

చెన్నైకి నీళ్లు తెచ్చేందుకు రంగంలోని రైళ్లు!

By:  Tupaki Desk   |   12 July 2019 9:46 AM GMT
చెన్నైకి నీళ్లు తెచ్చేందుకు రంగంలోని రైళ్లు!
X
పాడు కాలం వ‌చ్చేసింది. నీళ్ల కోసం యుద్దాలు వ‌స్తాయ‌ని క‌లాం మాష్టారు చెబితే.. అప్పుడెప్పుడో వ‌స్తుందిలే అనుకున్నంత‌నే నీళ్ల కోసం సిగ‌ప‌ట్లు మ‌న క‌ళ్ల ముందే జ‌రుగుతున్నాయి. ఇక‌.. యుద్దాలు స‌మీప దూరంలోనే ఉన్నాయ‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతున్న ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. మ‌నిషి చేసిన త‌ప్పున‌కు ఇప్పుడు ప్ర‌కృతి ప‌రీక్ష‌ల మీద ప‌రీక్ష‌లు పెడుతున్నాయి.

నీళ్ల కోసం చెన్నై వాసులు ప‌డుతున్న క‌ష్టం అంతా ఇంతా కాదు. చెన్నై మ‌హాన‌గ‌రంలో నీటి కోసం తిప్ప‌లు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. కంటి ముందు అంత పెద్ద స‌ముద్రం ఉన్నా.. ఆ నీటిని ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. భూగ‌ర్భ జ‌లాలు పూర్తిగా అడుగంటిపోయిన నేప‌థ్యంలో.. చాలా హోట‌ళ్లు భోజ‌నాల త‌యారీని నీళ్లు లేని కార‌ణంగా బంద్ చేసేశాయ్. ఇక‌.. నీళ్ల‌ను ఆఫ‌ర్లుగా పెట్టే షాపులు వ‌చ్చేశాయి.

ఇదిలా ఉంటే.. అంత‌కంత‌కూ పెరుగుతున్న చెన్నై న‌గ‌ర దాహార్తిని తీర్చేందుకు ప‌ళ‌ని స‌ర్కారు ఇప్పుడు రైళ్ల‌ను రంగంలోకి దించింది. చెన్నైకి పెద్ద ఎత్తున నీళ్లు అవ‌స‌ర‌మైన నేప‌థ్యంలో.. ఆ అవ‌స‌రాల‌కు స‌రిప‌డా నీళ్ల‌ను తెచ్చేందుకు వీలుగా రైళ్ల‌ను తిప్పటం షురూ చేసింది. రోజుకు రైళ్ల ద్వారా 10 మిలియ‌న్ లీట‌ర్ల నీటిని తీసుకురానున్నారు. చెన్నైకి కాస్త దూరంలో ఉండే వెల్లూరు జిల్లాలోని జోలార్ పేట నుంచి రైళ్ల‌ల్లో నీళ్ల‌ను చెన్నై న‌గ‌రానికి తీసుకువ‌స్తున్నారు.

ఈ రోజున తొలి నీటి రైలు చెన్నైకి చేర‌నుంది. గ‌తంలో ఇదే త‌ర‌హాలో తీవ్ర‌మైన నీటి ఎద్ద‌డి కార‌ణంగా మ‌హారాష్ట్రలోని లాతూరుకు ఇదే రీతిలో రైళ్ల‌ల్లో నీళ్ల‌ను తీసుకొచ్చారు. ట్రైన్ల‌లో నీళ్ల‌ను తేవ‌ట‌మేకాదు.. వాటి స‌ర‌ఫ‌రాకు ఇబ్బందులు ఏర్ప‌డంతో ప‌ట్ట‌ణంలో 144 సెక్ష‌న్ పెట్టి మ‌రీ నీటిని స‌ర‌ఫ‌రా చేశారు. చెన్నై విష‌యానికి వ‌స్తే.. నీళ్ల రైళ్ల‌ను రానున్న ఆరు నెల‌ల పాటు న‌డ‌పాల‌ని నిర్ణ‌యించారు.

చెన్నై మ‌హాన‌గ‌రంలో నీటి అవ‌స‌రాల్ని తీర్చే పూండి.. చెంబ‌రంబాక్కం.. షోల‌వ‌రం.. రెడ్ హిల్స్ చెరువులు పూర్తిగా ఎండిపోవ‌టంతో నీటి క‌ష్టాలు త‌ప్ప‌టం లేదు. ఈ నేప‌థ్యంలో రైళ్ల ద్వారా నీళ్ల‌ను తీసుకురావ‌టం ద్వారా చెన్నై వాసుల దాహార్తిని తీర్చాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. నీటి క‌ష్టం ఎంత దారుణంగా ఉంటుంద‌న్న చేదు అనుభ‌వాన్ని చూసినోళ్లు లాతూరు త‌ర్వాత చెన్నైవాసులేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.