Begin typing your search above and press return to search.

67 ఏళ్ల తర్వాత తొలిసారి కారణం లేకుండా భూటాన్ నుండి నీటి నిలిపివేత

By:  Tupaki Desk   |   26 Jun 2020 3:00 AM GMT
67 ఏళ్ల తర్వాత తొలిసారి కారణం లేకుండా భూటాన్ నుండి నీటి నిలిపివేత
X
చైనా మాయలో పడి ఇటీవల నేపాల్.. భారత్ భూభాగాన్ని తనదిగా ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీలంకను, బంగ్లాదేశ్‌ను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఓ వైపు పాకిస్తాన్, మరోవైపు చైనా కుయుక్తులను ఎదుర్కొంటున్న భారత్‌ కు భూటాన్ కూడా షాకిచ్చింది. అసోం రైతులకు వచ్చే కెనాల్ వాటర్‌ ను నిలిపి వేసింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ధర్నా కు దిగారు. అసోంలోని బక్సా జిల్లా సరిహద్దు రైతులకు కలదన్ నది నుండి నీటి విడుదలను నిలిపివేసింది భూటాన్.

భూటాన్ నది నుండి మానవ నిర్మిత ఛానల్ ద్వారా వచ్చే నీటిపై జిల్లాలోని 26 రెవెన్యూ గ్రామాలకు చెందిన 6,000 మంది రైతులు ఆధార పడ్డారు. ఈ చానల్‌ను కూడా రైతులే నిర్మించుకున్నారు. 1953 నుండి ఇది కొనసాగుతోంది. కానీ ఇప్పుడు ఆ దేశం హఠాత్తుగా, కారణం చెప్పకుండా నీటిని నిలిపి వేసింది. దీంతో రైతులు భూటాన్ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రైతులు నిరసనలు, ధర్నాలు చేపట్టారు. వాస్తవానికి ఈ నది పై భూటాన్‌కు ఎలాంటి హక్కు లేదు. కానీ రెండు దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధం వల్ల గ్రామాలకు నీళ్లు మళ్లించే ఛానల్ వ్యవస్థను ఏర్పాటు చేసారు.

దాదాపు 67 ఏళ్ల తర్వాత మొదటిసారి ఏం చెప్పకుండా నీటిని నిలిపివేయడం గమనార్హం. వ్యవసాయ సీజన్లో రైతులు ఎలాంటి అనుమతుల అవసరం లేకుండానే భూటాన్ వైపున్న గేట్లను ఎత్తేసి, పనులు చేసుకోవడం అలవాటు. అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి సాకుతో మన రైతులను భూటాన్ బలగాలు లోనికి అనుమతించడంలేదు. అలా కాదని వారు కూడా గేట్లు తెరవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు.