Begin typing your search above and press return to search.

ఇదేమి వైపరిత్యం... ఎవరెస్ట్ కే నీటి కొరత... ?

By:  Tupaki Desk   |   5 Feb 2022 1:30 AM GMT
ఇదేమి వైపరిత్యం... ఎవరెస్ట్ కే నీటి కొరత... ?
X
ఎవరెస్ట్ శిఖరం. ఎవరినైనా ఎక్కువగా మిక్కిలిగా వర్ణించాలి అంటే దీన్ని మించిన ఉపమానం వేరొకటి ఉండబోదు, ఎవరెస్ట్ అంత ఎత్తు అని చెబుతారు, గొప్పతనానికి కూడా ఎవరెస్ట్ మాదిరిగా కీర్తిమంతుడని అంటారు. ఇక ఎవరెస్ట్ కేవలం ఎత్తుకు మాత్రమే కాదు, మంచుతనానికి, చల్లదనానికి ప్రతీక. తెల్లని రంగుతో పల్లవించే ఈ కొండలు శాంతి కపోతాలుగా భూతలం మీద సొగసులీనుతూ కనిపిస్తాయి.

ఎవరెస్ట్ ఎక్కడ ఉంది అని ప్రశ్నలతో విద్యార్ధి బుర్ర చించుకుంటే ఎవరెస్ట్ ఎక్కాలని సాహస యాత్రీకుడు ఆరాటపడతాడు, ఎప్పటికైనా ఎవరెస్ట్ అంత ఖ్యాతిని ఆర్జించాలని మేధావి ఆలోచిస్తారు. ఇలా తరాలుగా యుగాలుగా ఎవరెస్ట్ శిఖరం మనిషి ఆశను, ఆకాంక్షను అలా పెంచుతూనే ఉంది.

ఎవరెస్ట్ ఉంది కాబట్టి మన ఎత్తు ఏంటో తెలుస్తోంది. ఎంత ఎత్తుకు ఎగరాలో, ఎంత బాగా ఎదగాలో కూడా ఒక బెంచ్ మార్క్ గా నిలిచి చెబుతోంది. అలాంటి ఎవరెస్ట్ కరిగితే. అంతటి మహా శిఖరం ఒరిగితే. అది ఊహకు అందనిది, ఏ మనిషీ కోరుకోనిదీ.

కానీ ప్రకృతిలో జరిగే అనేక మార్పుల వల్ల ఎవరెస్ట్ కే ముప్పు వచ్చింది. ఎవరెస్ట్ మీద 22 ఏళ్ళలో మంచు ఏర్పడింది అని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే అంతటి మంచు కూడా ఉఫ్ అని ఊదేసినట్లుగా కేవలం పాతికేళ్లలో కరిగిపోయింది అని నేచర్ క్లైమేట్ జర్నల్ పేర్కొంది అంటే ప్రకృతి ప్రేమికులకే కాదు ఎవరెస్ట్ ని ఒక సంపదగా భావించే వారికి దానికి మించిన విషాదం ఏముంటుంది అనే అనుకోవాలి.

ఈ జర్నల్ ఇంకా ఏం చెప్పింది అంటే ఎవరెస్ట్ వద్ద ఉన్న టూరిస్ట్ ప్రాంతంలో ఏకంగా 12 వేల కిలోలం మానవ‌ వ్యర్ధాలు ఉన్నాయని. వీటి వల్ల ఏర్పడే వేడితో పాటు, వాతావరణంలో మార్పులతో మంచు నెమ్మదిగా కరిగిపోతోందిట. ఇదిలా ఉంటే మరో దారుణమన బాంబు లాంటి విషయాన్ని కూడా చెప్పింది. అదేంటి అంటే భవిష్యత్తులో ఎవరెస్ట్ వద్ద నీటి కొరత కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది.

మొత్తానికి ఎవరెస్ట్ కే ఇన్ని కష్టాలా అని ఈ అంచనాలను చూస్తే అనిపించకమానదు, అదంతా మానవ తప్పిదంగానే చూడాలి. మరి ఎవరెస్ట్ ని కాపాడుకోవాలన్న ఆ మంచుని పదిలపరచుకోవాలీ అన్నా కూడా ఇంతకు మించిన తరుణం వేరేదీ లేదు, ఈ రోజు నుంచే అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రకృతి ప్రేమికులంతా కోరుతున్నారు.