Begin typing your search above and press return to search.

డ్యాం ఖాళీ చేసిన నీటికి రూ.21 లక్షల విలువ కట్టి జీతంలో కట్ చేయమన్నారు

By:  Tupaki Desk   |   30 May 2023 7:02 PM GMT
డ్యాం ఖాళీ చేసిన నీటికి రూ.21 లక్షల విలువ కట్టి జీతంలో కట్ చేయమన్నారు
X
ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఫోన్ రిజర్వాయర్ లో పడిపోయిన కారణంగా.. అందులోని లక్షలాది లీటర్లనీటిని ఎత్తి పోయించిన ఉదంతం గురించి తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలో సదరు ఉద్యోగుల తీరు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ఫోన్ ను నీళ్లలో పోగొట్టుకున్న ఉద్యోగి.. సదరు ఉద్యోగి ఫోన్ కోసం రిజర్వాయర్లలో ఉన్న నీటిని కిందకు వదిలేసిన ఇరిగేషన్ ఉద్యోగి ఇద్దరు తాము చేసిన పనులను సమర్థించుకుంటున్న తీరు చూస్తే.. ఒళ్లు మండాల్సిందే. తాము తీసుకున్న చెత్త నిర్ణయానికి సిగ్గుపడాల్సింది పోయి.. తాము న్యాయంగా.. ధర్మంగా వ్యవహరిస్తున్నట్లుగా వారు చెబుతున్న మాటలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.

అసలేం జరిగిందంటే.. చత్తీస్ గఢ్ లోని ఫుడ్ ఇన్ స్పెక్టర్ రాజేష్ విశ్వాస్ తన స్నేహితులతో కలిసి కాంకేర్ జిల్లాలోని ఖేర్ కట్టా డ్యామ్ వద్ద స్నానం చేయటానికి వెళ్లాడు. సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు ఫోన్ డ్యామ్ నీటిలో పడిపోయింది. దీంతో స్థానికులు ఫోన్ కోసం ప్రయత్నించగా వారికి దొరకలేదు. అయితే.. డ్యామ్ లోని నీటిని రెండు నుంచి మూడు అడుగులు తోడిస్తే ఫోన్ దొరుకుతుందని చెప్పారు.

తన ఫోన్ లో అధికారిక డేటా ఉండటంతో తాను ఇరిగేషన్ అధికారిక ఫోన్ చేసి అభ్యర్థించినట్లుగా చెబుతున్నారు. అయితే.. అదేమంత సమస్య కాదని చెప్పటంతో.. మూడు.. నాలుగు అడుగుల నీటిని తోడించగానే ఫోన్ దొరికినట్లుగా తన చర్యను సమర్థించుకోవటం విశేషం. ఎక్కువ మొత్తంలో నీరు ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే తాను మూడు.. నాలుగు అడుగుల నీటిని తోడించేందుకు అంగీకరించానని.. ఇందుకు స్థానికుల సాయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. జలవనరుల శాఖ అధికారి మాత్రం తాను ఐదు అడుగుల నీటిని తీసేందుకే పర్మిషన్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఫుడ్ ఇన్ స్పెక్టర్ ను ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పించగా.. నీటిని తోడించేందుకు అనుమతి ఇచ్చిన ఇరిగేషన్ అధికారి జీతం నుంచి డబ్బుల్ని ఎందుకు వసూలు చేయకూడదంటూ వివరణ లేఖను కోరారు.ఫోన్ కోసం 21 లక్షల లీటర్ల నీటిని తోడించిన పుడ్ ఇన్ స్పెక్టర్.. అనుమతి ఇచ్చిన ఇరిగేషన్ అధికారి జీతాల్లో నుంచి డబ్బులు వసూలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే.. ఇందుకు ఎంత మొత్తాన్ని డిసైడ్ చేస్తారన్నది ఇంకా తేలాల్సి ఉంది.