Begin typing your search above and press return to search.

2030కి ఇప్పటికి రెట్టింపు స్థాయిలో నీరు కావాలి!

By:  Tupaki Desk   |   18 Jun 2019 2:30 PM GMT
2030కి ఇప్పటికి రెట్టింపు స్థాయిలో నీరు కావాలి!
X
హైదరాబాద్ - బెంగళూరు - ఢిల్లీ తో పాటు మొత్తం 21 నగరాల్లో తాగునీటి ఎద్దడి గణనీయమైన స్థాయిలో పెరుగుతోంది. దీంతో ఆయా నగరాల్లోని పేద - బలహీన వర్గాల వారికి సమస్యలు ఎక్కువ అయ్యాయి. వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వాననీటి సంరక్షణ - సుదూర ప్రాంతాల్లోని నదుల నుంచి గొట్టాల ద్వారా నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇవేవీ సమస్యను పరిష్కరించలేకపోతున్నాయి. ఆయా జిల్లాల్లోని ప్రజలు కొన్ని దశాబ్దాలుగా అటు వ్యవసాయానికి - ఇటు దైనందిన అవసరాలకూ భూగర్భ జలాల పైనే ఆధారపడి ఉన్నారు. దక్షిణాదిలోనే పది కోట్ల మందికి గుక్కెడు నీరు కూడా దక్కని దారుణ స్థితి రానున్న రోజుల్లో వస్తుందని భావిస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటితే నగరవాసులు ప్రైవేట్‌ కంపెనీలు అక్రమంగా తవ్వితీసే నీటిపై ఆధారపడటం మొదలుపెడతారు. పరిస్థితి మరింత దిగజారిపోయేందుకు ఇదో కారణం కానుంది. దేశంలోని 130 కోట్ల ప్రజల్లో నీటి లభ్యత లేని వారి సంఖ్య 16 కోట్ల పైగా ఉన్నట్లు వాటర్‌ ఎయిడ్‌ నివేదికల ద్వారా తెలుస్తోంది.

నీటి కోసం ట్యాంకర్ల చుట్టూ వేల బిందెలు.. కుళాయిల వద్ద కొండవీటి చాంతాడంత క్యూ.. నగరాల్లోని బస్తీల్లో - కొన్ని గ్రామాల్లోనూ సాధారణంగా కనిపించే దృశ్యాలు. జనాభా పెరిగిపోతోంది.. అవసరాలూ ఎక్కువ అవుతున్నాయి. అందుకే ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని కొంతమంది చెబుతున్నారు. కానీ.. వాస్తవం వేరే ఉంది. భూగర్భంలో దాగున్న జలసిరులు వంద లీటర్లనుకుంటే. మనం వాడుకుంటున్నది 150 లీటర్లు ఉంటోంది. దీంతో నీటి ఎద్దడి మొదలైంది. అందుకే హైదరాబాద్‌ లాంటి నగరాల్లో బోరుబావుల లోతులు ప్రతి ఏటా పెరిగిపోతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌ లోని రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గత నాలుగేళ్లుగా కురిసిన వర్షాలు అరకొరగానే ఉండటంతో ప్రాజెక్టులూ నోళ్లు తెరుచుకున్నాయి. నీతి ఆయోగ్‌ 2018 నివేదిక ప్రకారం వచ్చే ఏడాదికి దేశంలోని ప్రధాన నగరాల్లో నీటి సమస్య మరితం ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని తెలుస్తోంది.

2030 కల్లా దేశంలో అందుబాటులో ఉన్న నీటికి రెండు రెట్లు ఎక్కువ డిమాండ్‌ ఏర్పడబోతోందని.. ఎద్దడిని అధిగమించేందుకు ప్రజలు పెట్టే ఖర్చు కారణంగా స్థూల జాతీయోత్పత్తిలో 6 శాతం కోత పడనుందని నీతి ఆయోగ్‌ హెచ్చరించింది. ఒకవేళ కొంతమందికి నీళ్లు అందుబాటులో ఉంటే అది కలుషితాలతో నిండినవే అయి ఉంటాయని.. ఆ నీరు తాగడం ద్వారా అనారోగ్యం పాలై ఏటా 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఉందని తెలిపింది. స్వచ్ఛమైన నీరు లభించే విషయంలో 122 దేశాల జాబితాలో భారత్‌ ర్యాంకు 120 కావడం ఇక్కడ చెప్పుకోవల్సిన విషయం.

జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న నీరు.. సమర్థ వాడకంపై ఇటీవలే కేంద్రం కాంపోజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌ను సిద్ధం చేసింది. దీని ప్రకారం సమర్థమైన నీటి యాజమాన్య పద్ధతులను పాటించడంలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ మూడోస్థానంలో ఉంది. తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. అయితే మిషన్‌ భగీరథ - కాకతీయ వంటి పథకాల కారణంగా తెలంగాణ తన పరిస్థితిని వేగంగా మెరుగుపరుచుకుంటోంది. భూగర్భజలాలతో పాటు సాగునీటి వసతులు - వాడకం వంటి 28 అంశాల ఆధారంగా సిద్ధం చేసిన ఈ సూచీలో మొత్తం 24 రాష్ట్రాలకు మార్కులు రాగా.. 14 రాష్ట్రాలు 50 కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోనే దాదాపు 60 కోట్ల జనాభా ఉండటం గమనార్హం.

నగరాల్లో పైపులైన్ల ద్వారా సరఫరా అవుతున్న నీరు 30 నుంచి 50 శాతం వృథా అవుతోందనే అంచనాల నేపథ్యంలో వాటి స్థానంలో కొత్తవాటిని వేసుకోవడం ద్వారా నీటిని ఆదా చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వాడేసిన నీటిని శుద్ధి చేసుకుని దైనందిన అవసరాలకు వాడుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. పారిశ్రామిక అవసరాలకు రీ సైకిల్‌ చేసిన నీటిని అందించడం ద్వారా విలువైన భూగర్భ జలాలను కాపాడుకోవచ్చు. దేశంలో సాగునీటి వసతి ఉన్న భూ విస్తీర్ణం 14 కోట్ల హెక్టార్లు కాగా.. ఇందులో కనీసం సగం సూక్ష్మ సేద్యం కిందకు తీసుకు రావాల్సిన అవసరముంది. ప్రస్తుతం దేశంలో బిందు - తుంపర సేద్యాల కింద సాగవుతున్న విస్తీర్ణం 77 లక్షల హెక్టార్లు మాత్రమే. మిగిలిన భూమిని కూడా బిందు - తుంపర సేద్యాల కిందకు తీసుకొస్తే.. సగటున 50 శాతం సాగునీటిని ఆదా చేయవచ్చని అంచనా.