Begin typing your search above and press return to search.

జల వివాదం : పోటాపోటీగా లేఖలు , ఎందుకీ వివాదం!

By:  Tupaki Desk   |   25 Aug 2021 10:59 AM GMT
జల వివాదం : పోటాపోటీగా లేఖలు , ఎందుకీ వివాదం!
X
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదిరింది. రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం పీక్ కు చేరింది. అటు తెలంగాణ మంత్రులు.. ఇటు ఏపీ మంత్రులు ఢీ అంటే ఢీ అంటున్నారు. భారతదేశంలోని పెద్ద నదుల్లో కృష్ణ నాలుగోది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రవహిస్తోన్న ఈ నది, పొడవులో గంగ, బ్రహ్మపుత్ర, గోదావరుల తరువాతి స్థానంలో ఉంటుంది.దాదాపు 1300 కిలోమీటర్లు ప్రవహించే ఈ నది, మహారాష్ట్ర నుంచి కర్ణాటక, అక్కడి నుంచి తెలంగాణ, ఆ తరువాత ఆంధ్రాలోకి వస్తుంది. సుమారు 90 కిలోమీటర్ల దూరం తెలంగాణలో ప్రవహించి, ఆ తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సరిహద్దుగా ఉంటుంది.

అంటే నదికి ఒకవైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉంటాయి. అలంపురం నుంచి ముక్త్యాల వరకు ఈ నది రెండు రాష్ట్రాలకు సరిహద్దు. ఆ తరువాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గా ఉన్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాల వివాదాలు ఉండేవి. ఒకే రాష్ట్రంలో ఉన్నప్పటికీ, తెలంగాణ, ఆంధ్ర మధ్య కూడా కృష్ణా నీటి విషయంలో వివాదం ఉంది. కృష్ణానదిపై శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్టులు తెలంగాణ, ఆంధ్రాలకు ఉమ్మడిగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు కుడివైపున ఏపీ ఉండగా, ఎడమవైపున తెలంగాణ ఉంది. వీటికి ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు తెలంగాణ భూభాగంలో ఉండగా, దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీ ఏపీ భూభాగంలో ఉంది. ఇవి కాక అనేక లిఫ్టు పథకాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల అవసరాలను ఈ ప్రాజెక్టులు తీరుస్తున్నాయి.

2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయాయి. బేసిన్ల లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ 68శాతం ఉండగా, నీటి వాటా 37 శాతం వచ్చింది. ఇక ఆంధ్రలో కృష్ణా బేసిన్ 32శాతం ఉండగా, నీటి వాటా 64 శాతం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి ముందు నుంచి ఉన్న 811 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలు పంచుకున్నాయి. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అనుకున్నారు. ఇది తాత్కాలిక సర్దుబాటు మాత్రమే. ఆంధ్రాకు వచ్చిన దాంట్లో తిరిగి కోస్తాకు 367 టీఎంసీలు, సీమకు 145 టీఎంసీలు అనుకున్నారు. ఇది కేవలం ఒప్పందం మాత్రమే. తీర్పు కాదు. నిజానికి కృష్ణా బేసిన్ తక్కువ ఉన్నప్పటికీ, ఆంధ్రాకు ఎక్కువ నీటి కేటాయింపు రావడానికి ముందు చెప్పుకున్నట్టు కృష్ణా డెల్టా తన హక్కు ఉపయోగించడం, దిగువన ఉండడం వంటివి కారణాలు.

సహజ జల సూత్రాల్లో బేసిన్ నిబంధన ప్రామాణికంగా తీసుకుంటే తెలంగాణకు, మొదటి వినియోగదారు నిబంధన ప్రామాణికంగా తీసుకుంటే ప్రత్యక్షంగా కోస్తా, పరోక్షంగా రాయలసీమకు మేలు. కాబట్టి బేసిన్ రూల్ కోసం తెలంగాణ, ఫస్ట్ యూజర్ రూల్ కోసం ఆంధ్రప్రదేశ్ పట్టుబడుతుంటాయి.

కృష్ణా జలాలను చెరి సగం పంచాలంటూ తెలంగాణ రాసిన లేఖకు ఏపీ ప్రభుత్వం కౌంటరిచ్చింది. రెండో ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారమే నీటి పంపకాలు జరగాలని డిమాండ్ చేసింది. 2021-22కి 70-30శాతం లెక్కన కృష్ణా జలాలు కేటాయించాలని కేఆర్ఎంబీని కోరింది.

కృష్ణా జలాలను 50-50శాతం కింద కేటాయించాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై ఏపీ అభిప్రాయం కోరింది కేఆర్ఎంబీ. తెలంగాణ డిమాండ్ పై అభ్యంతరం తెలిపిన ఏపీ సర్కార్, 70-30 నిష్పత్తిలోనే కేటాయింపులు చేయాలంది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి వాటాలు ప్రాజెక్టుల వారీగా జరగలేదని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లింది ఆంధ్రప్రదేశ్. కేవలం, చెన్నై, హైదరాబాద్ తాగునీటి విషయంలో మాత్రమే కొన్ని నిబంధనలు ఉన్నాయన్న ఏపీ సర్కార్ మిగతాదంతా పాత పద్ధతిలోనే కొనసాగించాలని కోరింది. 50-50 నిష్పత్తిలో కృష్ణా జలాలను పంపిణీ చేయాలన్న తెలంగాణ డిమాండ్ సహేతుకం కాదంటోంది ఏపీ. శ్రీశైలం నుంచి చెన్నైకు… సాగర్ నుంచి హైదరాబాద్ కు తాగునీటి కోసం మాత్రమే నీళ్లను తీసుకునేందుకు వెసులుబాటు ఉందని ఏపీ చెబుతోంది.