Begin typing your search above and press return to search.

సాయన్న అధికార లాంఛనాలపై అంత లొల్లి ఎందుకు?

By:  Tupaki Desk   |   21 Feb 2023 12:05 PM GMT
సాయన్న అధికార లాంఛనాలపై అంత లొల్లి ఎందుకు?
X
ఆయనో అధికార పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే. మంత్రి కావాల్సిన అర్హతలు ఉన్నా.. ఆయనకు కాలం కలిసి రాలేదు. 70 ఏళ్ల వయసులో ఆయన అనారోగ్యానికి గురై కన్నుమూశారు. అలాంటి సీనియర్ నేతకు ప్రభుత్వ లాంఛనాలతో ఘన నివాళి ఇస్తే తప్పేంటి? అధికార పక్షానికి చెందిన నాయకుడు కాకుంటే అర్థం చేసుకోవచ్చు. కానీ.. అధికారపార్టీకి చెందిన నేత అయి ఉండి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుగుదేశం నాటి నుంచి పరిచయం ఉన్న నేతగా సాయన్నకు పేరుంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కంటోన్మెంట్ కు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆయనకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగకపోవటం వివాదంగా మారింది.

ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ను పలువురు తప్పు పడుతున్నాడు. దళితుడైన సాయన్న.. స్వయంశక్తితో ఈ స్థాయికి చేరారని చెప్పాలి. పార్టీ ఏదైనా ఆయన అభ్యర్థిగా బరిలోకి దిగితే గెలుపు ఆయన చెంతకు వస్తుందన్న పేరుంది. అలాంటి సాయన్న అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తారని భావించారు. అందుకు తగ్గట్లే ప్రభుత్వ పెద్దల నుంచి హామీ వచ్చిందని చెబుతారు. ఏమైందో ఏమో కానీ.. శ్మశాన వాటికకు వచ్చి.. చితి మీదకు సాయన్న భౌతిక కాయాన్ని ఉంచిన తర్వాత అధికారిక లాంఛనాలు ఏవన్న ప్రశ్నతో.. ఆయన అంత్యక్రియలు గంటకు పైనే ఆగిపోయాయి.

ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోసే దుస్థితి. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిని అధిగమించేందుకు మంత్రులు తలసాని.. మల్లారెడ్డిలు ప్రయత్నించి.. వారి వల్ల కాక అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇలాంటి వేళ.. దళితుడైన ఎమ్మెల్యేకు సగౌరవంగా సాగనంపే సోయి సీఎం కేసీఆర్ కు లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇంతకూ తప్పు ఎక్కడ జరిగింది? అన్న విషయంలోకి వెళితే.. వేళ్లన్నీ ముఖ్యమంత్రి వైపే చూపిస్తాయి. సాంకేతికంగా చూస్తే.. ఇలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో నిర్ణయం జరగాలని చెబుతున్నా.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అలాంటి నిర్ణయాన్ని తీసుకునే ధైర్య సాహసాలు అధికారులకు లేని పరిస్థితి.

సాయన్న మరణవార్త విన్నంతనే.. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలన్న మాట కేసీఆర్ నోటి నుంచి వచ్చి ఉంటే.. జరగాల్సినవన్నీ జరిగిపోయేవి. ఒకవేళ.. ఆయన జాతీయ రాజకీయాల్లో తలమునకలై ఉన్నా.. అలాంటి ఆలోచన ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ కు రావాల్సింది. కానీ.. ఎందుకో రాలేదు. చివరకు సాయన్న క్యాంపు కార్యాలయానికి వెళ్లి మరీ నివాళులు అర్పించిన మంత్రి కేటీఆర్.. అప్పుడైనా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియులు జరుగుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని ప్రస్తావించి.. అందుకు తగ్గట్లు ఆదేశాలు జారీ అయి ఉంటే కూడా బాగుండేది. కానీ.. అలాంటిదేమీ జరగలేదు.

శ్మశాన వాటిక వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవటం.. దళితుడైన కారణంగా ప్రభుత్వం చిన్న చూపు చూపిందన్న మాటపై బ్రేకింగ్ న్యూసులు పెద్ద ఎత్తున రావటంతో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగటం.. ఇష్యూను క్లోజ్ చేయాలన్న ఆదేశాలతో.. సాయన్న కుమార్తెలను సముదాయించి.. అంత్యక్రియల్ని పూర్తి చేసినట్లు చెబుతున్నారు. ఈ ఇబ్బందికర పరిస్థితిని డీల్ చేసి.. సమస్యను పరిష్కారమయ్యేలా చేయటంలో ఉప సభాపతిగా వ్యవహరిస్తున్న పద్మారావు గౌడ్ తో పాటు ఎమ్మెల్యే మైనంపల్లి కీలక భూమిక పోషించారని చెప్పాలి.

మరోవైపు మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారని.. గ్యాప్ ఎక్కడ వచ్చిందంటూ సీఎస్ ను వివరణ కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇదంతా డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగానే తప్పించి.. మరేమీ లేదని చెప్పక తప్పదు. ఏమైనా.. ఒక సీనియర్ ఎమ్మెల్యేకు కడసారి వీడ్కోలు పలికిన తీరు ఏ మాత్రం సరిగా లేదని మాత్రం చెప్పక తప్పదు. ఇలాంటి తప్పులు ఇప్పటికిప్పుడు ప్రభావం చూపకున్నా.. భవిష్యత్తులో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ వీటికి సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.