Begin typing your search above and press return to search.

బలాలా మీద నాన్ బెయిలబుల్..

By:  Tupaki Desk   |   5 Feb 2016 4:52 AM GMT
బలాలా మీద నాన్ బెయిలబుల్..
X
ఒకేరోజు.. ఒకేలాంటి ఘటనలు రెండు చోటు చేసుకుంటే? వాటి మీద కేసులు కట్టే పోలీసులు రెండు రకాలుగా స్పందించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పాతబస్తీలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనలపై తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ ఇంటి మీద మజ్లిస్ పార్టీకి చెందిన మలక్ పేట ఎమ్మెల్యే బలాలా దాడి చేయటం.. డిప్యూటీ సీఎం కుమారుడిపై చేయి చేసుకోవటంతో పాటు.. ఉప ముఖ్యమంత్రి ఇంట్లోకి ప్రవేశించటం.. అడ్డుగా వచ్చిన డిప్యూటీ సీఎంను పక్కకు తోసేయటం లాంటి ఘటనలు చోటు చేసుకోవటం తెలిసిందే.

ఈ ఉదంతం జరగటానికి కొద్ది సమయం ముందుగా పాతబస్తీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మరో సీనియర్ నేత షబ్బీర్ అలీలపై బహిరంగ దాడికి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీతోపాటు.. ఆయన పార్టీ అనుచరులు పాల్పడ్డారు. ఈ రెండు ఘటనల్లో డిప్యూటీ సీఎం ఇంటి మీద దాడి చేసిన ఎమ్మెల్యే బలాలాపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు.. అదే సమయంలో ఉత్తమ్ పై దాడి చేసిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మీద మాత్రం బెయిలబుల్ కేసులు నమోదు చేయటం ఇప్పుడు చర్చగా మారింది.

ఉత్తమ్ పై దాడి చేసిన అసదుద్దీన్ ను అరెస్ట్ చేయకుండా ఉన్న పోలీసులు.. అసదుద్దీన్ ఎక్కడా అన్న ప్రశ్నకు మాత్రం యూపీలోని ఫైజాబాద్ అన్న సమాధానం రావటంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అసద్ పై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ సర్కారు వెనుకాడుతుందంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. ఆ పార్టీతో పొత్తుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే కేసీఆర్ సర్కారు అసద్ వ్యవహారంపై చూసీచూడనట్లుగా ఉందన్న మాట వినిపిస్తోంది.