Begin typing your search above and press return to search.

ఆర్డీవోకు వార్నింగ్.. విజయారెడ్డి సీన్ రిపీట్ అవుతుంది

By:  Tupaki Desk   |   8 Nov 2019 4:43 AM GMT
ఆర్డీవోకు వార్నింగ్.. విజయారెడ్డి సీన్ రిపీట్ అవుతుంది
X
షాకింగ్ గా మారిన అబ్దుల్లాపూర్ మెట్ తహిసిల్దార్ విజయారెడ్డి సజీవదహనం వ్యవహారం ఇప్పుడో బెదిరింపు అస్త్రంగా మారింది. రెవెన్యూ అధికారులను వణికిస్తున్న ఈ వ్యవహారం.. అనుమానించినట్లే జరుగుతోంది. విజయా రెడ్డి సజీవదహనం తర్వాత ఏపీ లో పలుచోట్ల.. పలు విభాగాల్లో పెట్రోల్ బాటిల్ తీసుకెళ్లి అధికారుల్ని బెదిరించిన వైనం తాజాగా చోటు చేసుకుంది.

ఇదిలా ఉంటే.. తెలంగాణ లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. కామారెడ్డి ఆర్డీవో రాజేంద్రకుమార్ కు ఒక బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. తమ కుటుంబానికి చెందిన 9.12 ఎకరాల భూమి వివాదంలో ఉందని.. దీనికి సంబంధించిన పాసు పుస్తకాలు తమ పేరుతో రాయాలని.. లేకుంటే విజయా రెడ్డికి పట్టిన గతే పడుతుందంటూ హెచ్చరించారు.

దీంతో భయపడిపోయిన సదరు ఆర్డీవో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారించిన పోలీసులు ఈ బెదిరింపులకు పాల్పడింది ఒక పోలీసేనని గుర్తించి అవాక్కయ్యారు. పోలీసు శాఖలోని ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేసే ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస రెడ్డిగా గుర్తించారు.

అతడి కుటుంబానికి ఉన్న 9.12 ఎకరాల భూమి వివాదంలో ఉండగా.. దాన్ని తన పేరు మీద మార్చాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. తాజా ఉదంతం రెవెన్యూ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున ఆందోళనలకు గురి చేస్తోంది. బెదిరింపులకు విజయా రెడ్డి ఉదంతం ఇప్పుడో కొత్త అస్త్రంగా మారిందన్న మాట వినిపిస్తోంది.