Begin typing your search above and press return to search.

అనిల్ బ్రదర్ కు అందమైన వార్నింగ్...?

By:  Tupaki Desk   |   16 March 2022 3:30 PM GMT
అనిల్  బ్రదర్ కు  అందమైన వార్నింగ్...?
X
ఆయన పెద్ద రాజకీయ కుటుంబానికి చెందిన వారు. వైఎస్సార్ ఇంటి అల్లుడు. ప్రస్తుత ముఖ్యమంత్రిని స్వయాన బావ. ప్రముఖ మత ప్రచారకుడు, బ్రదర్ అనిల్ కుమార్. ఆయన ఈ మధ్య ఏపీ రాజకీయాలను కాస్త హీటెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో వైసీపీ పాలన బాగులేదని నేరుగా అంటున్నారు. అయితే తాను కాకుండా తనను కలసిన వారు చెబుతున్నారు అని అనిల్ చెప్పడం ఇక్కడ విశేషం.

ఆయన విజయవాడ, విశాఖలలో వరస టూర్లు చేస్తున్నారు. బీసీలతో పాటు ఇంతర సామాజిక వర్గాల వారితో ఆయన చర్చిస్తున్నారు. వారి సమస్యలు వినాలి కదా అంటున్నారు. తాను వారిని హామీ ఇచ్చానని, వారి పనులు ఏపీలో అసలు జరగడంలేదని, అందుకే వారిని కలుస్తున్నానని రీసెంట్ గా విశాఖ పర్యటనలో ఆయన మీడియా ముందు చెప్పారు.

అంతే కాదు జగన్ని కలసి రెండున్నరేళ్ళు అయింది అని చెప్పకనే అసలు విషయం చెప్పారు. బీసీ ముఖ్యమంత్రి రావాలని కోరుతున్నారని, కొత్త పార్టీ అంటూ చాలానే చెబుతున్నారు. మరి వైసీపీ దీని మీద ఇప్పటిదాకా రియాక్ట్ అయింది లేదు కానీ ఏపీ క్రిస్టియన్ జేసేసీ పేరు మీద అనిల్ బ్రదర్ కు అందమైన వార్నింగ్ ఒకటి వచ్చింది.

ఏపీ రాజకీయాల్లో వేలెందుకు పెడుతున్నారు. మీ పని మీరు చూసుకుంటే మంచిది అని మెత్తగానే అంటించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ ఎలమంచిలి ప్రవీణ్ ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామంటూ జరుగుతున్న ప్రచారం వెనక అనిల్ ఉండడంపై మండిపడ్డారు.

అనిల్ రాజకీయ అవతారం ఎపుడు ఎత్తారు అని కూడా అయన ప్రశ్నిస్తున్నారు. అనిల్ తెలంగాణాలో రాజకీయాలకు పరిమితం అయితే మేలు అని అంటున్నారు. ఆయనకు రాజకీయాల మీద ఆసక్తి ఉంటే అక్కడ చూసుకోవాలని కూడా సూచించారు. మీ సతీమణి అక్కడ పార్టీ పెట్టారు కాబట్టి అక్కడ పార్టీ పనులను చూసుకోవడం ఉత్తమమని సలహా ఇచ్చారు.

ఏపీ రాజకీయాల్లోకి మీకు పనేంటి అని కూడా నిలదీశారు. అనిల్ కుమార్ అగ్ర కులానికి చెందిన వారు అయితే బీసీలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల గురించి వారి శ్రేయస్సు గురించి మాట్లాడం కంటే ఆశ్చర్యం ఉంటుందా అని కూడా ప్రవీణ్ అంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ అనిల్ ని శాతి దూతగా ప్రపంచానికి పరిచయం చేశారని, ఆ విధంగా ఆయన పేరు తెచ్చుకున్నారని గతాన్ని గుర్తు చేయడం విశేషం.

ఆ విధంగా దైవ సంబంధ కార్యక్రమాలతో అనిల్ ఉంటే మంచిది అని కూడా కాస్తా స్వీట్ వార్నింగ్ ఇస్తూ ప్రవీణ్ చెప్పడం విశేషం. మొత్తానికి సడెన్ గా క్రిస్టియన్ జేఏసీ ఎంటర్ కావడం అనిల్ కి హెచ్చరికలు జారీ చేయడంతో మ్యాటర్ హీటెక్కింది అనే అనుకోవాలి. మరి దీంతో అనిల్ ఆగుతారా ఏమో చూడాలి మరి.