Begin typing your search above and press return to search.

ఇంటికే పరిమితం కావాల్సిన రోజులు మళ్లీ వచ్చేస్తున్నాయి

By:  Tupaki Desk   |   16 July 2021 3:34 AM GMT
ఇంటికే పరిమితం కావాల్సిన రోజులు మళ్లీ వచ్చేస్తున్నాయి
X
అవును.. మాయదారి మహమ్మారి మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించబోతోంది. అందుకు ముందుగా తనదైన టీజర్ ను విడుదల చేసింది. ఇప్పటికే మొదటి.. రెండో వేవ్ తో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన పాడు కొవిడ్.. మరోసారి తానేమిటో చూపించేందుకు ముందుకు రానుంది. దీనికి సంబంధించి వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఓవైపు వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున సాగుతున్నా.. దాని దారి దానిదే.. మా దారి మాదే అన్న రీతిలో కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ అవుతున్నాయి. గడిచిన 9 వారాలుగా తగ్గుతూ వచ్చిన కేసులు.. తాజాగా మరోసారి పెరగటం మొదలైనట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గడిచిన రెండు వారాల్లో నమోదైన కేసులు.. చోటు చేసుకున్న మరణాల్ని చూసినప్పుడు.. ముందు వారంతో పోలిస్తే.. గత వారం మరణాల సంఖ్య మూడు శాతం అధికం కావటం గమనార్హం.

కిందటి వారం ప్రపంచ వ్యాప్తంగా 55వేల మరణాలు చోటు చేసుకోగా.. 30 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు వారంతో పోలిస్తే పది శాతం కేసులు ఎక్కువ నమోదైనట్లుగా గుర్తించారు. తాజాగా చోటు చేసుకుంటున్న మరణాలు.. నమోదవుతున్న కొత్త కేసులు ఎక్కువగా బ్రెజిల్.. భారత్.. ఇండోనేషియా.. బ్రిటన్ దేశాల్లోనే ఉన్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఎంతకు కొరుకుడుపడని డెల్టా వేరియంట్ తాజా కేసుల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు.

పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ పూర్తి అయ్యిందని చెబుతున్న అమెరికాలోనూ.. గడిచిన మూడు వారాలుగా నమోదవుతున్న కేసుల్ని చూస్తే.. అంతకంతకూ ఎక్కువ అవుతున్న విషయాన్ని గుర్తించారు. జూన్ తో పోల్చినప్పుడు ఈ నెలలో కేసుల నమోదు ఎక్కువగా ఉండటం గమనార్హం. జూన్ 23న అమెరికాలో రోజువారీగా నమోదైన కేసులు 11,300 అయితే.. జులై 12 నాటికి 23,600 కేసులు కాగా.. రెండు రోజులు గడిచేసరికి 35,447కు కేసుల పెరగటంచూసినప్పుడు కొత్త ఆందోళన కలగటం ఖాయం.

ఎందుకింత ఎక్కువగా కేసులు నమోదయ్యాయి అన్న విషయాన్ని చూస్తే.. అమెరికాలో వ్యాక్సినేషన్ తక్కువగా వేయించుకున్న రాష్ట్రాల్లో తాజా కేసులు నమోదైనట్లుగా తేలింది. ఈ రాష్ట్రాల్లో కనిష్ఠంగా 40 శాతం గరిష్ఠంగా 51 శాతం మాత్రమే టీకాలు వేయించుకున్నారు. అమెరికాలోనే కాదు.. రష్యా.. అర్జెంటీనా.. బెల్జియం.. బ్రిటన్.. మయన్మార్.. ఇలా ఆ దేశం కాదు ఈ దేశం కాదు అన్ని దేశాల్లోనూ తాజాగా మూడో వేవ్ మొదలైనట్లేనని చెబుతున్నారు. ఇదే విషయాన్ని పపంచ ఆరోగ్య సంస్థ టెడ్రెస్ చెబుతూ.. ‘మనం మూడో వేవ్ ప్రారంభ దశలో ఉన్నాం. డెల్టా వేరియంట్ త్వరలో మరింత ప్రబలంగా మారనుంది’ అంటూ భారీ బ్యాడ్ న్యూస్ చెప్పేశారు.

ఇదంతా చూస్తున్నప్పుడు.. కరోనా కేసులు అంతకంతకూ పెరగటం ఖాయమన్న సంకేతాన్ని ఇస్తున్నట్లుగా చెప్పక తప్పదు. వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున జరగటం.. ఇప్పటికే మొదటి రెండు దశల్లో కరోనా కేసులు భారీగా నమోదైన నేపథ్యంలో.. మూడో వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండదన్న అంచనాలు తెలిసిందే. అయితే.. ఇందుకు భిన్నంగా తాజా పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం.

ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కారుతో పాటు.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రెండో వేవ్ లో చేసిన తప్పులు చేయకుండా.. అటు కేంద్రం కానీ.. ఇటు రాష్ట్రాలు కానీ లాక్ డౌన్ తో పాటు.. కఠిన నిబంధనల్ని ముందస్తుగా విధించటం ద్వారా.. కేసుల వ్యాప్తిని కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఆ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అందుకు భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదు. చూస్తుంటే.. మరోసారి ఎవరిళ్లల్లో వారు బంధీ అయ్యే రోజులు మరెంతో దూరంలో లేవన్న విషయం తాజాగా ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులు చెప్పేస్తున్నాయి. సో.. బీ రెఢీ.. అని మానసికంగా సిద్ధం కావాల్సిన టైమొచ్చినట్లే.