Begin typing your search above and press return to search.

మొత్తానికి అమ్ర‌పాలికి పోస్టింగ్‌.. ఎక్క‌డంటే?

By:  Tupaki Desk   |   30 Aug 2018 5:18 AM GMT
మొత్తానికి అమ్ర‌పాలికి పోస్టింగ్‌.. ఎక్క‌డంటే?
X
ఐఏఎస్ లు చాలామందే ఉంటారు. కానీ.. కొంద‌రు త‌ప్పులు చేయ‌న‌ప్ప‌టికీ.. వారు తీసుకునే నిర్ణ‌యాలు మీడియాలో పెద్ద ఎత్తున ఫోక‌స్ అవుతూ ఉంటాయి. మీడియా పుణ్య‌మా అని కానీ.. వారు చేసే కొన్ని త‌ప్పులు కానీ మొత్తంగా వారిపై వివాదాస్ప‌ద ముద్ర ప‌డుతుంటుంది. తాజాగా అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు యువ ఐఏఎస్ అధికారిణి.. మొన్న‌టివ‌ర‌కూ వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ గా బాధ్య‌త‌ల్ని నిర్వ‌హించిన అమ్ర‌పాలి.

తన‌కు ప్ర‌భుత్వం ఇచ్చిన బంగ్లాలో దెయ్యం ఉంద‌న్న వ్యాఖ్య‌ల‌తో పాటు.. గ‌తంలో ఉన్న క‌లెక్ట‌ర్లు సైతం బంగ‌ళాలో పై అంత‌స్తును ఉప‌యోగించే వారు కాద‌న్న మాట‌ను చెప్ప‌టం.. మీడియాలో పెద్ద ఎత్తున ఆ వార్త‌లు రావ‌టంపై ప్ర‌భుత్వం గుర్రుగా ఉంద‌ని చెబుతారు.

ఇదొక్క‌టే కాదు.. అమ్ర‌పాలికి సంబంధించి గ‌తంలో ఆమె చేసిన వ్యాఖ్య‌లు.. ప‌లు సంద‌ర్భాల్లో వార్తల్లో వ‌చ్చే ఆమె తీరుపై ప్ర‌భుత్వం అసంతృప్తితో ఉంద‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. దీనికి త‌గ్గ‌ట్లే.. ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రించే అల‌వాటున్న ఆమెపై ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌భావం ప‌డింది.

కేసీఆర్ స‌ర్కారు ముంద‌స్తుకు వెళ్లాల‌న్న ఆలోచ‌న‌లో ఉంద‌న్న వార్త‌లు వ‌స్తున్న వేళ‌.. ప్ర‌భుత్వ ప‌రంగా..పాల‌నా ప‌రంగా చేస్తున్న మార్పుల్లో భాగంగా ఐఏఎస్.. ఐపీఎస్ అధికారుల బ‌దిలీలు చోటు చేసుకున్నాయి. వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆమెను బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అయితే.. ఆమెకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వ‌కుండా ఉండ‌టం వార్తాంశంగా మారింది.

ఇదిలా ఉంటే బుధ‌వారం ఆమెకు పోస్టింగ్ ఇస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. వెయిటింగ్ లో ఉన్న ఆమెను జీహెచ్ఎంసీ అద‌న‌పు క‌మిష‌న‌ర్ గా నియ‌మిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అదే స‌మ‌యంలో జీహెచ్ఎంసీకి అద‌న‌పు క‌మిష‌న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న భార‌తి హోలికేరిని మంచిర్యాల క‌లెక్ట‌ర్ గా బ‌దిలీ చేశారు. వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ పోస్టుతో పోలిస్తే.. గ్రేట‌ర్ అద‌నపు క‌మిష‌న‌ర్ పోస్టింగ్ అప్రాధాన్యంగానే చెప్పాలి. మ‌రి.. ఈ ప‌ద‌విలో అమ్ర‌పాలి ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి. అమ్ర‌పాలి తాజా పోస్టింగ్‌.. దెయ్యం ఎఫెక్ట్ గా అభివ‌ర్ణించే వారు లేక‌పోలేదు.