Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే ఆఫీసు కూల్చివేత.. నేతల్లో గుబులు

By:  Tupaki Desk   |   10 Oct 2020 4:00 PM GMT
ఎమ్మెల్యే ఆఫీసు కూల్చివేత.. నేతల్లో గుబులు
X
గత ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు ఏకాశిలానగరమైన వరంగల్ నీట మునిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల వరదముంపునకు గురైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు నగరంలోని 140పైగా కాలనీలు జలమయయ్యారు. కరోనా టైంలో ప్రజలంతా ఇంటికే పరిమితమైన సమయంలో కురిసిన చిన్నపాటి వానలకే వరంగల్ సిటీ మునిగిపోయింది. దీంతో నగరవాసులు ఎటువెళ్లాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. గతంలో తేలికపాటి వర్షాలకు హైదరాబాద్ నగరం మునిగేదని.. కేసీఆర్ పాలనలో వరంగల్ నగరం కూడా ఆ జాబితాలో చేరిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటంతో కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. వరద ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించి బాధితులతో మాట్లాడారు. వరంగల్లో చెరువులు, నాలాలను కబ్జా చేసి కొందరు అక్రమంగా నిర్మాణాలు చేయడంతోనే వరంగల్ నగరం ముంపునకు గురైందంటూ పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన కలెక్టర్, కార్పొరేషన్, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించేలా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి.

వర్ధన్నపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరూరి రమేష్ చెందిన క్యాంపు కార్యాలయాన్ని గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. దీనిపై టీఆర్ఎస్ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. నాలాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించినట్లు గతంలోనే అధికారులు గుర్తించారు. కేటీఆర్ పిలుపుతో ఎమ్మెల్యే అరూరి రమేష్ స్వచ్చంధంగా అక్రమ నిర్మాణాల తొలగింపునకు ముందుకొచ్చినట్లు ప్రచారం చేసుకొని టీఆర్ఎస్ లో ప్రజల్లో క్రేజ్ పొందాలని చూశారు.. ఈ మేరకు ఎమ్మెల్యేకు చెందిన క్యాంపు కార్యాలయాన్ని వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు తొలగిస్తే సహకరించి పాజిటివ్ సంకేతాలు పంపారు. కానీ అది కాస్తా వర్కవుట్ కాలేదని సమాచారం.

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్నే అధికారులు పడగొట్టడంతో ఇక తమ సంగతేంటని నాలాలు ఆక్రమించిన టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నేతలు, ద్వితీయ శ్రేణి నేతలంతా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం వరంగల్ నగరంలో నాలాలపై అక్రమంగా నిర్మించిన భవనాలు.. ప్రహరీల తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనిపై మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యేలను ఒప్పించి మరీ కూల్చివేయిస్తున్నారు. నేతలకు నచ్చ జెప్పుతున్నారు. కలెక్టర్, కార్పొరేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ సూచనలు చేశారు.

నగరంలో 324నిర్మాణాలు నాలాలపై ఉన్నట్లు గుర్తించామని.. వాటిలో 68తొలగించినట్లు మంత్రికి అధికారులు వివరించినట్లు సమాచారం. ఇటీవల భద్రకాళి, ములుగు రోడ్డు, నయీంనగర్‌ నాలాలపై ఉన్న ఆక్రమణ నిర్మాణాలను బల్దియా సిబ్బంది తొలగించారు. మంత్రి కేటీఆర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో అక్రమాల నిర్మాణాల కూల్చివేతపై అధికారులు దూకుడుగా వెళుతుండటం గమనార్హం. దీంతో ఈ ఆక్రమణలు చేసుకున్న నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.