Begin typing your search above and press return to search.

రాజ‌య్య‌.. బేజారు.. చివ‌ర‌కు క్ష‌మాప‌ణ‌లు.. క‌థ‌ముగుస్తుందా?

By:  Tupaki Desk   |   12 March 2023 7:40 PM GMT
రాజ‌య్య‌.. బేజారు.. చివ‌ర‌కు క్ష‌మాప‌ణ‌లు.. క‌థ‌ముగుస్తుందా?
X
మ‌హిళ‌ల విష‌యంలో మ‌రోసారి అడ్డంగా బుక్క‌యిన వరంగ‌ల్ జిల్లా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌.. బేజారెత్తారు. గ‌తంలో ఒక‌సారి మ‌హిళ‌కు ఫోన్ చేసి.. 'ర‌మ్మ‌ని' పిలిచిన వ్య‌వ‌హారం..రాష్ట్రంలో క‌ల‌క‌లం రేగింది. దీంతో ఆయ‌న‌ను ఉన్న‌ప‌ళాన డిప్యూటీ సీఎం పోస్టు నుంచి ప‌క్క‌న పెట్టారు.ఇక‌, ఇప్పుడు సొంత పార్టీ మ‌ద్ద‌తు దారు.. స‌ర్పంచ్ న‌వ్య‌కు కూడా ఆయ‌న హానీ ట్రాప్ వేశారు. వేరే కీల‌క నాయ‌కురాలితో ఫోన్ చేయించి.. ఎమ్మెల్యేతో షాపింగ్‌కు రావాల‌ని.. అది కూడా భ‌ర్త లేకుండా.. ఇంటికి రావాల‌ని.. ఆమెతో చెప్పించార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

దీంతో ఈ వ్య‌వ‌హారం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. వ‌రంగ‌ల్ జిల్లా జానకీపురం సర్పంచ్ న‌వ్య నేరుగా మీడియా ముందుకు వ‌చ్చి ఫోన్ రికార్డింగును బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. ఈ వ్య‌వ‌హారంపై మ‌హిళా క‌మిష‌న్ సీరియ‌స్ అయింది.

రాజ‌య్య‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో వెనువెంట‌నే పార్టీ పెద్దలు, అధిష్ఠానం కలుగజేసుకుని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సర్పంచ్ ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే రాజయ్య క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

అధిష్ఠానం ఆదేశం, నవ్య భర్త ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చానని ఆయన తెలిపారు. పార్టీ అధిష్ఠానం తనకు పలు సూచనలు చేసిందని వివరించారు. అందరూ కలిసి పనిచేయాలని చెప్పిందని రాజయ్య పేర్కొన్నారు.

తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు కోరుతున్నానన్నారు. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని తెలిపారు. తాను ఏ ఊరి పట్ల వివక్ష చూపలేదని పేర్కొన్నారు. మహిళలు వారి హక్కులు సాధించుకోవాలని వివరించారు. ఊపిరి ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తానని వివరించారు.

ఇంత‌టితో ఆగ‌డం క‌ష్ట‌మే!!

ప్ర‌స్తుతం ఎన్నికల కాలం గ‌డుస్తున్న నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని బీజేపీ సీరియ‌స్‌గా తీసుకుంది. ఎమ్మెల్సీ క‌విత‌పై బీజేపీ చీఫ్ సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ర‌చ్చ చేసిన నేప‌థ్యంలో రాజ‌య్య వ్యాఖ్య‌ల‌ను కూడా రాజ‌కీయం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. దీంతో సోమ‌వారం నుంచి బీఆర్ ఎస్ కు వ్య‌తిరేకంగా ధ‌ర్నాలు చేయ‌నుంద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో రాజ‌య్య వ్య‌వ‌హారం ఇప్ప‌టితో ఆగేది కాద‌ని స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.