Begin typing your search above and press return to search.

కోర్టు చెప్పినా పరిహారం ఇవ్వరా?

By:  Tupaki Desk   |   9 Feb 2019 8:22 AM GMT
కోర్టు చెప్పినా పరిహారం ఇవ్వరా?
X
న్యాయం కోసం కోర్టుకెక్కిన రైతులకు పరిహారం అందించాలని పలుమార్లు అధికారులను ఆదేశించింది. అయినా పెడచెవిన పెట్టిన అధికారులకు కోర్టు షాక్ ఇచ్చింది. ఈ సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగింది. రైతులకు చెల్లించిన రూ.27.81లక్షల కింద ఆర్డీవో కార్యాలయం సామగ్రిని జప్తు చేయాలని కో్ర్టు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో బాధిత రైతులు ఆర్డీవో కార్యాలయానికి సామగ్రిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్డీవో కార్యాయలంలోని కంప్యూటర్, ఫర్నిచర్ తరలించేందుకు రైతులు ప్రయత్నించారు. ఆర్డీవో వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోకపోవడంతో ఆయన కలెక్టర్ ప్రశాంత్ జే. పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ వారితో మాట్లాడి వారంరోజుల్లో కొంత నష్టపరిహారం అందిస్తామని, నెలరోజుల్లో పూర్తిగా అందజేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు వెనక్కి తగ్గారు.

దీనిపై బాధితులు మాట్లాడుతూ 1990లో రఘునాథపల్లిలో చెక్ డ్యాం నిర్మించేందుకు వెంకట్ రెడ్డి - చంద్రారెడ్డి - యాదవరెడ్డిలకు చెందిన 5.5ఎకరాలను ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. పరిహారం కింద రూ.27.81లక్షలు చెల్లిస్తామని అప్పట్లో ప్రకటించిందని నేటికీ ఆ పరిహారం అందలేదని బాధితులు తెలిపారు. పలుమార్లు కోర్టు కూడా బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిందని అయినా అధికారులు పెడచెవిన పెట్టడంతో ఆర్డీవో కార్యాలయ సామగ్రి జప్తుకు ఆదేశాలు జారీ చేసింది తెలిపారు. ఆర్డీఓ కార్యాలయ సామగ్రిని తీసుకెళ్లేందుకు కూడా అధికారులు ఒప్పుకోవడంలేదని వాపోయారు.

కలెక్టర్ వారంరోజుల్లో తమకు పరిహారం ఇస్తామని చెప్పారని ఇవ్వకపోతే ఈసారి కచ్చితంగా ఆర్డీఓ కార్యాలయంలోని సామగ్రిని తీసుకెళుతామని స్పష్టం చేశారు. తమ భూమి ఉంటే ఏదో ఒక పంట వేసుకొని జీవించేవారని తెలిపారు. 30ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరగడానికే సమయం సరిపోతుందని తెలిపారు. ఏదిఏమైనా ఇలాంటి నిర్లక్ష్యపు అధికారులపట్ల కోర్టు సరైన నిర్ణయం తీసుకుందని పలువురు అభినందిస్తున్నారు. తమదాకా వస్తే తప్ప నొప్పింటే తెలియదు అన్న చందంగా ఉంది ప్రభుత్వ అధికారుల పనితీరు. ఇప్పటికైనా బాధితులకు త్వరగా న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.