Begin typing your search above and press return to search.

వ్యక్తిగత విమర్శలకి దిగుతున్న ట్రంప్, జో బిడెన్ !

By:  Tupaki Desk   |   3 Nov 2020 9:30 AM GMT
వ్యక్తిగత విమర్శలకి దిగుతున్న ట్రంప్, జో బిడెన్ !
X
అమెరికా లో ఎన్నికల వేడి కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచి మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టాలని ట్రంప్ , ఈసారి ఎలాగైనా గెలవాలని డెమొక్రాట్ల అభ్యర్థి జో బిడెన్ తీవ్రంగా కష్టపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. తూటాల్లాంటి మాటలను సంధించుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా యుద్ధానికి తెర తీశారు. డొనాల్డ్ ట్రంప్.. ఆయన ప్రత్యర్థి, డెమొక్రాట్ల అభ్యర్థి జో బిడెన్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తుంది. ట్వీట్ల ద్వారా విమర్శలను గుప్పించుకుంటున్నారు.
ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల వ్యవహారం రోజులు గడిచే కొద్ది వ్యక్తిగత దాడులకూ దారి తీస్తోంది. అమెరికాలో నివసిస్తోన్న నల్లజాతీయులపై దాడులకు జో బిడెన్ కారకుడయ్యాడంటూ డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. 47 సంవత్సరాలుగా జో బిడెన్ బ్లాక్ అమెరికన్లపై ఏదో ఒక రూపంలో దాడులు సాగిస్తున్నాడని ఆరోపించారు. జో బిడెన్‌ను సూపర్ ప్రిడేటర్‌ గా చెప్పారు. ఒక జంతువు మరో జంతువును అతి దారుణంగా చంపి భక్షించేలా జో బిడెన్ వ్యవహరిస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు.

ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే ప్రతి బ్లాక్ అమెరికన్ తన ఓటు హక్కును వినియోగించుకోవాలని, జో బిడెన్‌ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. జో బిడెన్‌ ను, ఆయన దుర్మార్గాలను ఎదుర్కొనడానికి ఇదొక్కటే అవకాశం అని, తాను అధికారంలోకి వస్తే నల్ల జాతీయులపై దాడులు చేయాలని, వారిని జైలుకు పంపాలని కలలు గంటోన్న జో బిడెన్ ‌కు ఓటు అనే ఆయుద్ధంతో బుద్ధి చెప్పాలని , అయన అధికారాన్ని అందుకుంటే నల్ల జాతీయుల వినాశనానికి బిడెన్ ప్రయత్నిస్తారని ట్రంప్ ఆరోపించారు. ఈ మేరకు ట్రంప్ ఓ ట్వీట్ చేశారు.

ఇక , అదే ట్విట్టర్ వేదికగా జో బిడెన్ డొనాల్డ్ ట్రంప్ ‌కు కౌంటర్ ఇచ్చారు. ఆధునిక అమెరికాలో అత్యంత అవినీతిపరుడుగా డొనాల్డ్ ట్రంప్ ముద్ర వేయించుకున్నారని ఆరోపణలు చేశారు. అత్యంత జాత్యహంకార అధ్యక్షుడిగా అతణ్ని అమెరికన్లు గుర్తిస్తున్నారని విమర్శించారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో లక్షలాది మంది అమెరికన్లు ఉపాధిని కోల్పోయారని, వరస్ట్ జాబ్స్ ప్రెసిడెంట్ ‌గా ఆధునిక చరిత్రలో ఆయన నిలిచిపోతారని ధ్వజమెత్తారు. మరొక్క అవకాశం ఇవ్వాలని ఆయన అమెరికన్లను కోరుతున్నారని, ఎందుకివ్వాలనే ప్రశ్నకు ట్రంప్ వద్ద సమాధానం లేదని అన్నారు. మరో నాలుగేళ్ల పాటు పరిపాలించే అధికారం ట్రంప్‌కు ఎందుకివ్వాలని జో బిడెన్ ప్రశ్నించారు.