Begin typing your search above and press return to search.

అనంత టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ వార్

By:  Tupaki Desk   |   16 Jun 2016 11:21 AM GMT
అనంత టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ వార్
X
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి - ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ చౌదరిల మధ్య చాలాకాలంగా విభేదాలున్న విషయం తెలిసిందే. అవి తాజాగా మరోసారి బయటపడ్డాయి. గురువారం అనంతపురం నగరాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశమైంది. ఈ సమావేశానికి ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి - ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి సైతం హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇటీవల నగరంలో కొద్దిరోజుల క్రితం మొదలైన రామ్‌ నగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం గురించి చర్చకు వచ్చింది. ఈ చర్చలో భాగంగా ఎంపీ జేసీ - ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ చౌదరిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరు నేతలూ గట్టిగా ఒకరిపై మరొకరు కేకలు వేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ జేసీ మాట్లాడుతూ "ప్రజల కష్టాలు తీర్చాలని అనుకున్నాను. నాదే తప్పు. ఇక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీకో నమస్కారం" అంటూ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

వంతెన కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, అయితే, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా పనులు ఆలస్యమవుతుంటే, ఎంపీ రాజకీయ లబ్దికి యత్నిస్తున్నారని ప్రభాకర్ ఆరోపించారు. అసలా సాంకేతిక సమస్యలే మీ వల్ల వచ్చాయంటూ విరుచుకుపడ్డ జేసీ - ప్రజలకు మేలు కలగాలని కోరుకోవడం తన తప్పయిపోయిందని అన్నారు. ఈ నిర్మాణం కోసం రైల్వేగేటు సమీపంలో ఉన్న మున్సిపల్‌ దుకాణాల భవనాన్ని తొలగించాల్సి ఉంది. ఇరుకు రోడ్లను వెడల్పు చేయడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయగా కోర్టు కేసులతో ఎమ్మెల్యే అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని ఎంపీ జేసీ దివాకరరెడ్డి ఆరోపిస్తున్నారు.

మరోవైపు అనంతపురం జిల్లాలోని కదిరిలో కూడా టీడీపీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇటీవల స్థానిక మార్కెట్ కమిటీ పదవులను కందికుంట వర్గీయులు దక్కించుకున్నారు. పదవుల ప్రమాణ స్వీకారానికి గురువారం అట్టహాసంగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్ఏ చాంద్ బాషాను కందికుంట వర్గం ఆహ్వానించలేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే చాంద్ బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట మధ్య మరింత దూరం పెరుగుతుంది. ప్రమాణ స్వీకారానికి తనని ఆహ్వానించకపోవడంతో ఆగ్రహించిన బాషా నారా లోకేష్ కు కందికుంటపై ఫిర్యాదు చేశారు. చివరకు నారా లోకేశ్ జోక్యం చేసుకోవడంతో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది.