Begin typing your search above and press return to search.

మోరిస్​, పాండ్యా మధ్య మాటల యుద్ధం.. ఐపీఎల్​ నిర్వాహకుల మందలింపు

By:  Tupaki Desk   |   30 Oct 2020 11:30 AM GMT
మోరిస్​, పాండ్యా మధ్య మాటల యుద్ధం..  ఐపీఎల్​ నిర్వాహకుల మందలింపు
X
ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్​లో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్​లో సూర్యకుమార్​ చెలరేగి ఆడటంతో ముంబయి జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబయి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆ హార్దిక్ పాండ్యా క్రీజ్​లో ఉన్నాడు. ఆ సమయంలో బెంగళూరు బౌలర్ క్రిస్ మోరిస్ కు హార్థిక్​ కు మధ్య చిన్న వివాదం చెలరేగింది. 19వ ఓవర్లో మోరిస్ విసిరిన బంతికి పాండ్యా సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత మోరిస్​ ఏదో సైగ చేశాడు. దీంతో పాండ్యా కూడా అతడితో ఘర్షణకు దిగాడు. ఆ మరుసటి బంతికే మోరిస్ పాండ్యాను అవుట్ చేశాడు. అప్పడు మోరిస్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది.

కోహ్లీ కల్పించుకొని ఇద్దరికి సర్ది చెప్పాడు. హార్దిక్ మాత్రం మోరిస్ దే తప్పు అన్నట్లుగా చేతులతో చూపించాడు. అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. హార్దిక్ అవుట్ అయ్యాక వచ్చిన పోలార్డ్ ఒక ఫోర్ కొట్టగా.. ఆ తర్వాతి ఓవర్ లో సూర్య కుమార్ యాదవ్ మ్యాచ్ ను ముగించాడు.

ఈ సంఘటనను అంపైర్లు మ్యాచ్ ముగిసిన తర్వాత ఐపీఎల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్ళడంతో వారు పాండ్యా, మోరిస్ లను పిలిపించి వివరణ కోరారు. తాము నిబంధనలు ఉల్లంఘించినట్టు ఇరువురూ అంగీకరించడంతో మందలింపుతో సరిపెట్టారు. వారికి ఎలాంటి జరిమానా విధించలేదు. నిబంధనలు ఉల్లంఘించినట్లు క్రిస్ మోరిస్, హార్దిక్ పాండ్యా ఒప్పుకొన్నారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవల్ 1-2.5ను మోరిస్.. లెవల్ 1-20ను పాండ్యా అతిక్రమించాడు.దీంతో కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1 బ్రీచ్ కింద మ్యాచ్ రిఫరీ ఇద్దర్నీ మందలించారు.