Begin typing your search above and press return to search.

వైసీపీ మంత్రి, కాపు నేత మధ్య లేఖల యుద్ధం!

By:  Tupaki Desk   |   7 Feb 2023 3:00 PM GMT
వైసీపీ మంత్రి, కాపు నేత మధ్య లేఖల యుద్ధం!
X
ఏపీ రాజకీయాలు కాపుల చుట్టూనే తిరుగుతున్నాయి. తరచూ జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న అనకాపల్లి ఎమ్మెల్యే, ఏపీ ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య మండిపడ్డ సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం గుడివాడ అమర్నాథ్‌ ను ఉద్దేశించి హరిరామజోగయ్య లేఖ రాశారు.

ఆ లేఖలో... "డియర్‌ అమర్నాథ్‌ రాజకీయాల్లో నువ్వో బచ్చావి.. పైకి రావలసినవాడివి. సాధారణ మంత్రి పదవికి అమ్ముడుబోయి కాపుల భవిష్యత్తును పాడు చేయకు. అనవసరంగా పవన్‌ కల్యాణ్‌ పై బురద జల్లడానికి ప్రయత్నం చేయకు. నీ భవిష్యత్తు కోరి చెబుతున్నా" అంటూ హరిరామజోగయ్య.. గుడివాడ అమర్నాథ్‌ ను లేఖలో హెచ్చరించారు.

ఈ లేఖకు సమాధానమిచ్చిన గుడివాడ అమర్నాథ్‌ మరో లేఖలో వెటకారంగా స్పందించారు. ఈ మేరకు హరిరామజోగయ్యకు ఆయన లేఖ రాశారు. ఆ లేఖలో... "గౌరవనీయులైన హరిరామజోగయ్య గారికి నమస్కారాలు. కాపుల భవిష్యత్తు విషయంలో చంద్రబాబుతో జత కడుతున్న పవన్‌ కల్యాణ్‌ గార్కి రాయాల్సిన, చెప్పాల్సిన విషయాలను పొరపాటున నాకు రాశారు. మీకు ఆయురారోగ్యాలతో, మానసికంగా దృఢంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని గుడివాడ అమర్నాథ్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగానే లెటర్‌ –2 పేరుతో గుడివాడ అమర్నాథ్‌.. హరిరామజోగయ్యకు మరో లేఖాస్త్రం సంధించారు. అందులో.. "వంగవీటి మోహన్‌ రంగా గారిని చంపించింది చంద్రబాబేనని మీరు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అలాంటి చంద్రబాబుతో పొత్తులకు సిద్ధమైన పవన్‌ కల్యాణ్‌ ను మీరు సమర్థిస్తారా?.. స్పష్టం చేయగలరు" అని గుడివాడ అమర్నాథ్‌.. హరిరామజోగయ్యను కోరారు.

ఇలా కాపు నేతల మధ్య ఏపీలో లేఖల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు కాపు సంఘాలు గుడివాడ అమర్నాథ్‌.. హరిరామజోగయ్యకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. మంత్రి పదవి కోసమే తరచూ పవన్‌ కల్యాణ్‌ పై గుడివాడ అమర్నాథ్‌ విమర్శలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో అమర్నాధ్‌ దిష్టి బొమ్మకు నిమ్మకాయల దండలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలం జరిగిన యువశక్తి సభలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ సైతం గుడివాడ అమర్నాథ్‌ పై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.