Begin typing your search above and press return to search.

వైసీపీలో వార్.. ఓటీ వర్సెస్ డీటీ.. ఇదే హాట్ టాపిక్

By:  Tupaki Desk   |   8 March 2021 12:30 PM GMT
వైసీపీలో వార్.. ఓటీ వర్సెస్ డీటీ.. ఇదే హాట్ టాపిక్
X
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పుడు ఓటీ (ఒరిజినల్ టీం) వర్సెస్ డీటీ (డూప్లికేట్ టీం) నడుస్తోంది. రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీ నాయకులు ఎవరి దారి వారిదే అన్నట్లుగా సాగుతున్నారట. అయితే ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల వరకు చాలా ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే ఇలాంటి క్యాడర్ ను అధిష్టానం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కొందరు ఈ విషయాన్ని చెప్పినా వారు పెడచెవిన పెడుతున్నారట.

2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఏకపక్ష విజయవాన్ని అందుకొని అధికారంలోకి వచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైసీపీ). అప్పట్లో టీడీపీపై ఉన్న వ్యతిరేకతతో పాటు వైఎస్ జగన్ మీద ఉన్న సానుభూతితో ప్రజలు 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలను గెలిపించారు. అయితే అంతకుముందు టీడీపీలో ఉన్న నాయకులు టికెట్ హామీతో వైసీపీలో ఇబ్బడి ముబ్బడిగా చేరారు. దాదాపు అందరికీ టికెట్లు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కొందరు ఆశావహులకు మాత్రం పదవులు దక్కలేదు. అటు టికెట్ దక్కక.. ఇటు పదవులు దక్కకపోయినా పార్టీలోనే కొనసాగారు. కానీ రాను రాను వారిలో నిరాశలు పెట్రేగిపోతున్నాయి. దీంతో వైసీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయని చర్చించుకుంటున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓ వర్గం వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిందనే వార్తలు వచ్చాయి. దీంతో ఇప్పుడు పార్టీలో ఓటీ వర్సెస్ డీటీగా మారిందని అనుకుంటున్నారు.

అయితే ఇలా పార్టీలో ఉంటూ వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారట. కానీ వీటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని కొందరు నాయకులు వాపోతున్నారు. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటే పార్టీలో గ్రూపు విభేదాలున్నాయన్న విషయం బయటపడుతుందని, దీంతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని భావిస్తున్నారట.

అయితే ఇది ఇలాగే కొనసాగితే మాత్రం పార్టీ పలు చోట్ల తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇలాంటి వారు పార్టీలోనే ఉంటూ పక్కపార్టీలకు సాయం చేస్తారని అంటున్నారు. వారికి పదవులు రాకపోవడంతో ఇలా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, వారిని పిలిచి చర్యలు తీసుకోవడమో.. లేదా హెచ్చరించడమో చేస్తే బాగుంటుందని అంటున్నారు. మరి దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.