Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ తో యుద్ధమొస్తుందా...?

By:  Tupaki Desk   |   7 Sep 2015 11:19 AM GMT
పాకిస్థాన్ తో యుద్ధమొస్తుందా...?
X
పొరుగు దేశం పాకిస్థాన్ పాలకులు, అధికారుల వ్యాఖ్యలు చూస్తుంటే వారు భారత్ తో యుద్ధం వస్తుందన్న తీవ్ర ఆందోళనలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. దేశాల ఇంటిలిజెన్స్ వ్యవస్థ సామర్థ్యాలు... అందులోనూ నిత్య వివాదాలతో నలిగే భారత్, పాక్ లు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం విషయంలో ఎవరినీ తక్కువ అంచనాలు వేయలేం. ఈ కారణంగానే పాకిస్థాన్ ఆందోళనల వెనుక కారణం ఉండే ఉంటుందని భావిస్తున్నారు. నిప్పులేనిదే పొగ రాదని... భారత్ నుంచి అలాంటి ఆలోచనలు, వ్యూహాలు, సన్నాహకాలను గుర్తించడం వల్లే పాకిస్థాన్ పదేపదే భారత్ తో యుద్ధం వచ్చే అవకాశాలపై మాట్లాడుతోందని విదేశాంగ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు.

తాజాగా కూడా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ భారత్ తో యుద్ధం గురించి ప్రస్తావించారు. యుద్ధమే కనుక వస్తే భారత్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ అన్నారు. భారత్ తో 1965 యుద్ధం 50వ వార్షికోత్సవం సందర్భంగా ఆ దేశ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ ఆర్మీ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. పొరుగుదేశం ఏమైనా దుస్సాహసానికి ఒడిగడితే తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని భారత్ ను ఉద్దేశించి హెచ్చరించారు కూడా. భవిష్యత్ లో యుద్ధాలకు సిద్ధపడాల్సి ఉంటుందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ కూడా ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రహీల్ అందుకు ప్రతిగా ఈ వ్యాఖ్యలు చేశారా.... లేదంటే నిజంగానే రెండు దేశాల మధ్య యుద్ధం రావడానికి అవకాశాలున్నాయా అనేది తెలియాల్సి ఉంది.

భారత్ లో కూడా పాకిస్థాన్ తో యుద్ధం వచ్చే అవకాశాలపై కొద్దికాలంగా ఊహాగానాలున్నాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్రధాని కావడంతో చాలామంది ఇలాంటి భావనలో ఉన్నారు. అయితే... అది ఇప్పుడే కాదని... వచ్చే ఎన్నికలకు ముందు పాక్ తో యుద్ధం చేసి ఆ హీరోయిజంతో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మోడీ ఎత్తుగడ పన్నుతారని రాజకీయ, విదేశాంగ రంగాల్లో అనుభవం ఉన్నావారు అంటున్నారు. ఏమవుతుందో కాలమో చెప్పాలి..