Begin typing your search above and press return to search.

బంధువుల మధ్య యుద్ధం

By:  Tupaki Desk   |   14 Nov 2018 4:24 AM GMT
బంధువుల మధ్య యుద్ధం
X
రాజకీయాల్లో పదవులే తప్ప ప్రేమలుండవనడానికి అనేక ఉదాహరణలున్నాయి. తండ్రీ కొడుకులు - అన్నదమ్ములు - తల్లి కొడుకులు - తండ్రీ కూతురు... ఇలా స్వంత మనుషులే ప్రత్యర్ధులుగా ఎన్నికల బరిలో దిగి సవాల్ విసురుకుంటున్న సందర్భాలు అనేకం. తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. అయితే ఇక్కడ ప్రత్యర్ధులుగా కొందరు బరిలోకి దిగితే మరికొందరు మాత్రం పార్టీలో టిక్కట్లు ఆశించి తమ వారి కారణంగా టిక్కట్ల రాక శత్రువులుగా మారుతున్న వైనం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు డీ.కె.అరుణ మహబూబ్ నగర్ జిల్లా గద్వాల నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆమెకు తిరుగులేదనే వార్తలు వస్తున్నాయి. ఆమెకు ప్రత్యర్ధిగా - తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధిగా అరుణ మేనల్లుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇంతకు ముందు ఈయన తన అత్త అరుణ చేతిలో రెండు సార్లు ఓడిపోయారు. ముచ్చటగా మూడోసారి మళ్లీ బరిలో నిలుస్తున్నారు. ఈ ఎన్నికల పుణ్యమాని డీ.కె.అరుణ కుటుంబం రెండు మూడు నెలల వరకూ ప్రత్యర్ధుగానే మసలడం విశేషం.

ఇక వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అయితే పోటీ మరీ కీలకంగా మారింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ ఉపముఖ్యమంత్రి - తాజా మాజీ శాసనసభ్యుడు రాజయ్య తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఈయనపై కాంగ్రెస్ పార్టీ ఓ బ్రహ్మస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇక్కడి నుంచి రాజయ్య బావమరిది భార్య ఇందిర కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. సొంత బావమరిది భార్యే తనకు ప్రత్యర్ధి కావడం - పైగా మహిళ కూడా కావడంతో రాజయ్యకు లోలోపల గుబులు ఎక్కువవుతోందంటున్నారు. దీంతో పాటు ఇందిర ఆర్ధికంగా చాలా బలమైన అభ్యర్ధి. కల్వరి చానెల్ యజమాని కూడా అయిన ఇందిరను తెలుగు వారు కల్వరి ఇందిర అని సంబోధిస్తుంటారు. వీరిద్దరి పోటీ కారణంగా ఇరు కుటుంబాలు కూడా రెండు నెలలుగా ప్రత్యర్ధులుగా మారడం విశేషం. ఇక కాంగ్రెస్ పార్టీలో మరో కుటుంబ కలహం విచిత్రంగా ఉంది. నగరంలోని కంటోన్ మెంట్ స్ధానం నుంచి పోటీ చేయాలని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ప్రయత్నించారు. అక్కడి నుంచే తాను కూడా పోటీ చేస్తాను టిక్కట్ ఇవ్వండంటూ సర్వే సత్యనారాయణ కుమార్తె భర్త క్రిషాంక్ కాంగ్రెస్ అధిష్టానాన్ని అర్ధించారు. అయితే ఢిల్లీ బలమైన లాబీయింగ్ ఉన్న సర్వే సత్యనారా‍యణ ముందు ఆయన అల్లుడు క్రిషాంక్ పాచికలు పారలేదు. కాంగ్రెస్ అధిష్టానం అల్లుడిని కాదని - మామకే టిక్కట్ కట్టపెట్టింది. దీంతో తనకు అన్యాయం జరిగిందని - తాను కంటోన్ మెంట్ స్ధానం నుంచి స్వత్రంత అభ్యర్ధిగా పోటీ చేస్తానంటూ క్రిషాంక్ ప్రకటించారు. ఈ మామ - అల్లుళ్ల వివాదంలో అటు తండ్రికి చెప్పలేక... ఇటు భర్తను సముదాయించలేక ఓ ఆడకూతురు నలిగిపోవడం విశేషం.