Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ లెక్క తేలాలంటే మరో2 వారాలు వెయిట్ చేయాలట

By:  Tupaki Desk   |   2 Dec 2021 1:30 AM GMT
ఒమిక్రాన్ లెక్క తేలాలంటే మరో2 వారాలు వెయిట్ చేయాలట
X
కరోనా ఎపిసోడ్ కు ముగింపు పలకొచ్చన్న వేళ.. ఎంట్రీ ఇచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాల్ని వణికించేలా చేస్తోంది. ఈ వేరియంట్ ను దక్షిణాఫ్రికాలో గుర్తించి దాదాపు వారం దాటింది. ఇప్పటివరకు గుర్తించిన ప్రమాదకర వేరియంట్ల మాదిరి.. భారీ ఎత్తున మరణాలు లేకపోవటం ఒకింత ఊపిరిపీల్చుకునే అంశంగా చెప్పాలి. ఇప్పటివరకు ఈ వేరియంట్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురి కావటం.. ఆసుపత్రుల్లో చేరేందుకు క్యూలు కట్టటం లాంటివేమీ చోటు చేసుకోవటం కొంతలో కొంత ఊరటనిచ్చే అంశంగా చెబుతున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో అత్యధికులు యూత్ కావటం.. వారిలో ఆలసట.. తలనొప్పి.. కండరాల నొప్పులు లాంటి తేలిక లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. వీటి నుంచి బయటపడేందుకు రెండు.. మూడు రోజులు పడుతోందని చెబుతున్నారు. ఈ వేరియంట్ ను తొలిసారి గుర్తించిన దక్షిణాఫ్రికా వైద్యులు.. ఈ వేరియంట్ గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.

డెల్టా వేరియంట్ వేళ పరిస్థితి ఇప్పటికి భిన్నంగా ఉందని చెప్పాలి. తీవ్రమైన అనారోగ్యానికి గురై.. ఆసుపత్రిలో పెద్ద ఎత్తున చేరటం తెలిసిందే. ఈ నేపథ్యంలో డెల్టా వేరియంట్ వర్సెస్ ఒమిక్రాన్ చూసినప్పుడు.. డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిలో వేగం ఎక్కువగా ఉన్నప్పటికీ.. దాని కారణంగా ప్రాణాలు పోయేంత దారుణ పరిస్థితులు మాత్రం లేవంటున్నారు. ఈ కారణంగా ఒమిక్రాన్ ఇన్ ఫెక్షన్ స్పీడ్ ఎక్కువైనప్పటికి.. ఇదేమీ ప్రాణాంతకమైనది కాదంటున్నారు.

అంతేకాదు.. వ్యాక్సిన్ వేసుకున్న వారు సైతం ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడినప్పటికీ.. వారి మీద ఇదేమీ తీవ్ర ప్రభావితం చూపలేదన్న మాట వినిపిస్తోంది. ఒమిక్రాన్ మ్యుటేషన్స్ డెల్టా వేరియంట్ కు రెండు రెట్లు అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. శ్వాసకోస వ్యాధులు కలిగించే ఇతర వైరస్ లూ ఇలాగే పరిణామం చెందుతాయని.. దీని వల్ల ప్రాణాలు పోయే ప్రమాదకర పరిస్థితులు ఉండవంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ను కొందరు శాస్త్రవేత్తలు టీ కప్పులో తుపానుగా పోలిస్తే.. మరికొందరు ఎర్లీ క్రిస్మస్ తో పోలుస్తుండటం కొంత ఉపశమనం కలిగించేలా చేస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఈ వేరియంట్ మీద తొందరపడటం లేదు. మిగిలిన వారి మాదిరి దీని తీవ్రత ఫలానా అన్నట్లుగా వ్యాఖ్యలు చేయటానికి ఇష్టపడటం లేదు. మరోరెండు వారాలు ఆగితే.. దీని తీవ్రత ఏమిటి? దీని బారిన పడిన వారి పరిస్థితి ఏమిటన్న వివరాలు అర్థమవుతాయని.. అప్పటివరకుఆగాలని చెబుతున్నారు. ఒమిక్రాన్‌ ఎలా వ్యాప్తి చెందుతుంది? దీని నుంచి వ్యాక్సిన్లు మనల్ని రక్షిస్తాయా? ఒమిక్రాన్‌ వల్ల ఆస్పత్రి పాలవ్వడం, మరణాలు పెరుగుతాయా? పాతవాటికంటే ఇది తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుందా వంటి ప్రశ్నలకు సరైన సమాధానం వచ్చే వరకు దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమంటున్నారు.

మొత్తంగా ఒమిక్రాన్ వేళ వ్యాక్సిన్ వేసుకోని వారు వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలని... ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న వారు బూస్టర్ డోస్ తప్పనిసరిగా వేసుకోవాలంటున్నారు. అయితే.. మన దేశంలో మాత్రం బూస్టర్ డోస్ మీద ప్రభుత్వం ఇప్పటివరకు విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోకపోవటం తెలిసిందే.