Begin typing your search above and press return to search.

స్పిన్ ను ఎదుర్కోవడంలో టీం ఇండియా టాపార్డర్ విల విల.. మాజీ స్టార్ ఆటగాడి అసంతృప్తి

By:  Tupaki Desk   |   30 March 2021 2:30 AM GMT
స్పిన్ ను ఎదుర్కోవడంలో టీం ఇండియా టాపార్డర్ విల విల.. మాజీ స్టార్ ఆటగాడి అసంతృప్తి
X
ఇంగ్లాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను టీం ఇండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి వన్డేలో గెలిచిన భారత్ రెండో వన్డేలో ఓడిపోయింది. తప్పక గెలవాల్సిన మూడో వన్డేలో టీం ఇండియా చచ్చి చెడి విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. ముందుగా 40 ఓవర్లకే సుమారు 300 పరుగులు చేసిన టీం ఇండియా ఆటగాళ్లు చివరి 10 ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయారు.

టీమిండియా జోరు చూస్తే 400 పరుగులు ఖాయమని అనుకోగా వరుసగా వికెట్లు కోల్పోవడంతో 330 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య చేదనలో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ త్వరగా పెవిలియన్ కు చేరుకున్నా సామ్ కర్రాన్ ఈ టెయిలెండర్ల సాయంతో చివరి ఓవర్ దాకా క్రీజులో ఉండి ఇంగ్లాండ్ ను గెలిపించినంత పని చేశాడు. చివరి ఓవర్లో నటరాజన్ అతడిని కట్టడి చేయడంతో టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.

టీమిండియా టాపార్డర్ పై వీవీఎస్ లక్ష్మణ్ విమర్శలు

భారత్ లో మొదటి నుండి బ్యాట్స్ మెన్లు స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్న వారే. భారత్లో స్పిన్నర్లు కూడా ఎక్కువే. భారత ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ ను బాగా ఆడతారని ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. అయితే నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా టాప్ ఆర్డర్ ఇంగ్లాండ్ స్పిన్నర్లు మొయిన్ అలీ, అదిల్ రషీద్, లివింగ్ స్టోన్ బౌలింగ్ ను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డారు. భారీ స్కోరు సాధ్యమని అనుకోగా భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ స్పిన్నర్ల బౌలింగులో అవుట్ అయి దిరిగారు. దీంతో భారత్ 48.2 ఓవర్లకే కుప్పకూలింది. డెత్ ఓవర్లలో భారీ పరుగులు సాధించాల్సి ఉండగా ఆ ఓవర్లలోనే టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ వరుసగా అవుట్ అయ్యారు. దీంతో భారత్ 330 పరుగులకే పరిమితం అయ్యింది.

దీనిపై టీం ఇండియా మాజీ ఆటగాడు లక్ష్మణ్ స్పందిస్తూ.. స్పిన్నర్ల ను ఎదుర్కోవడంలో టీమిండియా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు ఇబ్బందిపడటం స్పష్టంగా కనిపించినట్లు పేర్కొన్నారు. ఇది తనను విస్మయానికి గురి చేసినట్లు తెలిపారు. మొదటి నుంచి భారత బ్యాట్స్ మెన్ కు స్పిన్ ను ఎదుర్కోవడం సులువేనని అన్నారు. స్వదేశంలో స్పిన్ కు అనుకూలించే పిచ్ లపై భారత ఆటగాళ్ల ఆటతీరును పునః సమీక్షించుకోవాలని వీవీఎస్ లక్ష్మణ్ సూచించారు. కాగా ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ స్పిన్నర్లు మొయిన్ అలీకి ఒక వికెట్, రషీద్ రెండు, లివింగ్ స్టోన్ ఒక వికెట్ తీశారు.