Begin typing your search above and press return to search.

వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్ వారసుడి అరంగేట్రం

By:  Tupaki Desk   |   30 Jun 2023 9:00 AM GMT
వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్ వారసుడి అరంగేట్రం
X
టీమిండియా తరఫున మరుపురాని టెస్టు ఇన్నింగ్స్ ఆడిన ఆ క్రికెటర్ వారసుడు తానూ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానంటున్నాడు. తండ్రి బాటలో వెరీ వెరీ స్పెషల్ గా నిలుస్తానంటున్నాడు. ఇప్పటికే ఉన్న క్రికెటర్ల వారసుల తరహాలో కాకుండా ముద్ర చూపిస్తానంటున్నాడు. అతడే వంగీపురం వెంకటసాయి లక్ష్మణ్ (వీవీఎస్ లక్ష్మణ్)గా కుమారుడు సర్వజిత్.

రోహాన్ గావస్కర్, అర్జున్ టెండూల్కర్ తరహాలో ఎడమచేతి వాటం బ్యాటింగ్ ను ఎంచుకున్న సర్వజిత్ హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) లీగ్‌ లలో తన తొలి సీజన్‌ ను ఘనంగా మొదలుపెట్టాడు. 2 రోజుల లీగ్‌ లో సికింద్రాబాద్‌ నవాబ్స్‌ తరపున ఆడిన సర్వజిత్‌.. రెండో మ్యాచ్‌ లోనే సెంచరీ కొట్టాడు. మొదటి మ్యాచ్‌ లో 30 పరుగులు సర్వజిత్ రెండో మ్యాచ్ కు దానిని సెంచరీగా మలిచాడు.

ఫ్యూచర్‌ స్టార్‌ జట్టుతో బుధవారం ముగిసిన మ్యాచ్‌లో సర్వజిత్‌ (104; 209 బంతుల్లో 12×4, 1×6) సత్తాచాటాడు. చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. అతడికిదే కెరీర్ తొలి శతకం. కానీ, సికింద్రాబాద్‌ నవాబ్స్‌ మాత్రం 191 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొదట ఫ్యూచర్‌ స్టార్‌ 70.5 ఓవర్లలో 427 పరుగులకు ఆలౌట్ అయింది. నవాబ్స్‌ 71.3 ఓవర్లలో 236కే కుప్పకూలింది. సర్వజిత్‌ పోరాడినా.. మరోవైపు వికెట్లు పడడంతో పరాజయం తప్పలేదు.

ఎడమచేతి వాటం..

వీవీఎస్ లక్ష్మణ్ అంటే కుడిచేతి వాటం సొగసరి బ్యాటింగ్. అందులోనూ హైదరాబాదీ స్ట్రోక్ ప్లే నైపుణ్యం కనిపిస్తుంది. ఈ మణికట్టు మాయాజాలంతోనే అతడు ఆస్ట్రేలియాలాంటి జట్లను వణికించాడు. కానీ, సర్వజిత్ మాత్రం ఎడమచేతి వాటం బ్యాటర్.

తండ్రితో పాటు హైదరాబాదీ దిగ్గజాలైన మాజీ కెప్టెన్ అజహరుద్దీన్, అంబటి రాయుడు తరహాలోనే ఎడమచేతితో సొగసైన ఆటను సర్వజిత్ కొనసాగిస్తాడమో చూడాలి. కాగా, దిగ్గజ క్రికెటర్లు సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్ వారసులు రోహాన్, అర్జున్ ఎడమచేతి వాటం వారే.

టీమిండియా అవసరాలకు తగినట్లుగా ఉపయోగపడతారని వారసులను ఉద్దేశపూర్వకంగానో, వారి అభిరుచి ప్రకారమో వారు ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. వీరిలాగే సర్వజిత్ ను కూడా లక్ష్మణ్ ఎడమచేతి వాటం బ్యాటర్ గా ప్రోత్సహించినట్లు స్పష్టమవుతోంది.