Begin typing your search above and press return to search.

వైఎస్ కొడుగ్గా భయపడొద్దు జగన్.. జైలుకెళ్లమన్న ఉండవల్లి

By:  Tupaki Desk   |   5 April 2021 3:27 PM IST
వైఎస్ కొడుగ్గా భయపడొద్దు జగన్.. జైలుకెళ్లమన్న ఉండవల్లి
X
మెదడులో గుజ్జు ఉన్న తెలుగు నేతల్లో ఉండవల్లి ఒకరు. విషయం ఉన్న ప్రతి ఒక్కరు ప్రజలకు దగ్గర కాలేరు. ఉండవల్లి చెప్పే మాటల్ని వినేటోళ్లకు కొరత ఉండదు. విన్నంతనే పార్టీలకు అతీతంగా మా గొప్పగా చెప్పాడండి పెద్ద మనిషి అనేస్తారు. కానీ.. ఆయన లాంటి నేత చట్టసభల్లో ఉంటే.. ఆ లెక్కే వేరుగా ఉంటుందన్న ధ్యాస ప్రజల్లో పెద్దగా ఉండదు. ఈ కారణంతోనే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోతారు. అప్పట్లో వైఎస్ ఛరిష్మాతో గెలిచేసిన ఉండవల్లి.. తన వ్యక్తిగత ఇమేజ్ తో మాత్రం గెలుపు గుర్రాన్ని అందుకోలేని పరిస్థితి.

రాజకీయం కంటే కూడా.. ఏపీ బాగుండాలని ఆత్రుత పడే నేతల్లో ఉండవల్లి ఒకరు. ఈ రోజుకు ఏపీ రాష్ట్ర విభజన గురించి.. దాని కారణంగా నష్టపోయిన దాని గురించి మాట్లాడే నేత ఎవరైనా ఉన్నారంటే అది ఆయనొక్కరే. అంతేకాదు.. విభజన రోజు సభలో ఏం జరిగింది? అన్న విషయాన్ని కేంద్రాన్ని పలుమార్లు అడిగినా.. ఇప్పటివరకు అధికారికంగా ఏమీ చెప్పలేదని.. దాని గురించి వివరాలు వెల్లడించాలంటూ ఆయన తరచూ వాదిస్తున్నా.. పట్టించుకునే ఏపీ నేతలు కనిపించరు. ఆ మాటకు వస్తే.. ఏపీ ప్రజలు దాన్ని సీరియస్ గా తీసుకోరు.

ఏపీకి ఏదైనా నష్టం జరుగుతున్నంతనే గుండె బాదేసుకునే ఉండవల్లి.. తాజాగా వైజాగ్ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం కోరల నుంచి తప్పించే అంశాన్ని తరచూ మాట్లాడుతున్నారు. తాజాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడిన ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎదిరించటంలేదని సూటిగా ప్రశ్నించారు.

అంతేకాదు.. భయపడటం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు లక్షణమే కాదన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణల కారణంగానే కేంద్రంతో సీఎం జగన్ పోరాడలేకపోతున్నట్లుగా ప్రచారం జరుగుతుందని.. దేశంలో ఎక్కడా లేని విధంగా 51 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ఎందుకు భయపడాలని ప్రశ్నించారు. ‘‘151 సీట్లు ఏ రాష్ట్రంలో రాలేదు. భయపడటం వైఎస్ఆర్ కొడుకు చేయాల్సింది కాదు. పోతే జైలుకే పోతారు. జైలేమైనా కొత్తా నీకు.. జైలుకెళ్లు. దేనికి భయపడటం. ఇప్పుడు జరుగుతోంది.. సోషలిజం వర్సెస్ క్యాప్టలిజం. మీరు నాయకత్వం తీసుకోండి. మీరు ఇవాళ వెనుకడుగు వేస్తే.. అది మీ తప్పుగానే జనం భావిస్తారు. ఇంత గొప్ప మెజార్టీ ఇచ్చిన రాష్ట్ర ప్రజల వెంట నిలబడతారా లేదా మోడీ.. అమిత్ షాల మాటలు వింటారా అన్నది తేల్చుకోండి’’ అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. జగన్ రెడ్డి తిరగబడతాడనే ఏపీ ప్రజలు అనుకుంటున్నారని.. పార్లమెంటు వేదికగా పోరాడాలన్నారు. విశాఖలో సెమినార్ పెట్టాలని.. వైజాగ్ డిక్లరేషన్ ఇద్దామని ఉండవల్లి పిలుపునిచ్చారు. మరి.. ఆయన ఇచ్చిన సూచనపై జగన్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. విశాఖ ఉక్కు కర్మాగారం మీద జగన్ కానీ పోరాడి.. దాని ప్రైవేటీకరణ ఆపగలిగితే.. ఏపీ ప్రజల గుండెల్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో మోడీ సర్కారుతో ఫైట్ చేసిన ఘనత ఆయన సొంతమవుతుంది. మరేం జరుగుతుందో చూడాలి.