Begin typing your search above and press return to search.

చెవులు కొరుక్కొని.. చెప్పులతో కొట్టుకున్న వీఆర్వోలు

By:  Tupaki Desk   |   18 Nov 2019 6:40 AM GMT
చెవులు కొరుక్కొని.. చెప్పులతో కొట్టుకున్న వీఆర్వోలు
X
రెవెన్యూ.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వివాదాస్పదమైన శాఖగా ముద్రపడింది. రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన అవినీతి , విచ్చలవిడితనంపై ప్రజల్లోనూ తిరుగుబాటు మొదలైంది. తాజాగా తెలంగాణలో తహసీల్దార్ హత్య తర్వాత రెవెన్యూలో ఏ అలజడి జరిగినా అది వార్త అవుతోంది.

తాజాగా కర్నూలు తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఇద్దరు వీఆర్వోలు కొట్టుకున్న తీరు రెవెన్యూశాఖను అభాసుపాలు చేసింది. ఆదివారం కార్యాలయానికి వచ్చి మరీ వీరు కొట్టుకోవడం విశేషం.

కర్నూలు మండలంలోని సుంకేసుల వీఆర్వో వేణుగోపాల్ రెడ్డి, జోహరాపురం వీఆర్వో కృష్ణదేవరాయలు రక్తం కారేలా కొట్టుకున్నారు. వేణుగోపాల్ రెడ్డి చెవిని కృష్ణదేవరాయులు కొరకడంతో రక్తస్రావమైంది. ఇద్దరూ వెళ్లి అనంతరం పోలీస్ కేసులు కూడా పెట్టుకున్నారు.

వీఆర్వో వేణుగోపాల్ తహసీల్దార్ కార్యాలయంలో డిజిటల్ కీ సాయంతో వెబ్ ల్యాండ్ లో వివరాల నమోదు వ్యవహారాలు చూస్తుంటారు. తమ గ్రామ పరిధిలో పనులు వేణుగోపాల్ రెడ్డి కావాలనే పెండింగ్ లో పెడుతున్నాడంటూ మరో వీఆర్వో కృష్ణదేవరాయులు గొడవ పెట్టుకున్నాడు. మాట మాట పెరిగి కింద పడి కొట్టుకునేదాకా పరిస్థితి వెళ్లింది. చెవి కొరకడం.. రక్తం కారడంతో తహసీల్దార్ తిరుపతి రంగప్రవేశం చేశారు. పోలీస్ స్టేషన్ లో ఇద్దరు వీఆర్వోలకు రాజీ చేసి కేసులు లేకుండా తీసుకెళ్లారు.

అయితే వీఆర్వోలు కొట్టుకున్న వ్యవహారం మీడియాలో పతాక శీర్షికన రావడంతో కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ సీరియస్ అయ్యారు. ఇద్దరు వీఆర్వోలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

అయితే రైతుల నుంచి భూముల డేటాను ఆన్ లైన్ లో ఎక్కించడానికి వేణుగోపాల్ రెడ్డి లక్షలు లంచంగా తీసుకున్నాడని తనకు చిల్లిగవ్వ ఇవ్వడం లేదన్న కోపంతో మరో వీఆర్వో కృష్ణదేవరాయులు ఈ గొడవ పెట్టుకున్నట్టు తెలిసింది. ఇలా అవినీతి వ్యవహారమే వీఆర్వోలు కొట్టుకోవడానికి కారణంగా తెలుస్తోంది.