Begin typing your search above and press return to search.

స్వాతంత్య్రం వచ్చాకా.. ఇదే తొలి సారి!

By:  Tupaki Desk   |   21 May 2019 6:31 AM GMT
స్వాతంత్య్రం వచ్చాకా.. ఇదే తొలి సారి!
X
సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఈసారి అత్యధిక పోలింగ్‌ నమోదైంది. ఏడు విడతల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సరాసరి 67.11 శాతం పోలింగ్‌ నమోదు కావడం విశేషం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంతటి పెద్ద మొత్తంలో ఓటర్లు తరలిరావడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు.

అయితే ఎన్నికల కమిషన్‌ ఇప్పటి వరకు స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు. కానీ పోలింగ్‌ నమోదు ఆధారంగా లెక్కిస్తే ఈసారి రికార్డు పోలింగ్‌ శాతం నమోదు అయినట్లు తెలుస్తోంది. కాగా గత 2014 ఎన్నికల్లో 66.4 శాతం పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మహిళలు భారీగా తరలివచ్చారు. గతంలో కంటే 4.5 కోట్ల మంది మహిళలు ఈసారి అదనంగా ఓటుహక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఓటింగ్‌లో పాల్గొన్న పురుషులు - మహిళల మధ్య తేడా కూడా తగ్గిపోయింది.

పురుషులు - మహిళల మధ్య ఓటింగ్‌ శాతం 2009లో 9 శాతం ఉండగా.. 2014లో 1.4 శాతానికి చేరింది. కాగా ఈసారి 0.4 శాతానికి రావడం విశేషం. ఈక్రమంలో పశ్చిమబెంగాల్‌లో 75 శాతం పైగా పోలింగ్‌ నమోదైంది. అత్యల్పంగా జమ్మూ కశ్మీర్‌లో 35 శాతం కంటే తక్కువ నమోదు కావడం విశేషం.

అయితే నగర ప్రాంతాల కంటే గ్రామాల్లోనే ఎక్కువ పోలింగ్‌ నమోదైనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల కంటే ఢిల్లీలో 5 శాతం, గాజియబాద్‌ లో 4.08 శాతం - అహమదాబాద్‌ లో 2.5 శాతం - వడోదరలో 3 శాతం తక్కువ పోలింగ్‌ నమోదు అయినట్లు స్పష్టం అవుతోంది. కాగా 2014 ఎన్నికల కంటే బెంగళూరు, ముంబయి నగరాల్లో ఓటింగ్‌ శాతం పెరగడం విశేషం.

విడతల వారీగా..

తొలివిడత– 69.58
రెండోవిడత – 69.45
మూడోవిడత – 68.40
నాల్గోవిడత – 65.50
ఐదోవిడత – 64.16
ఆరోవిడత – 64.40
ఏడోవిడత – 65.16