Begin typing your search above and press return to search.

ఢిల్లీలో ముగిసిన పోలింగ్..57.9 శాతం ఓటింగ్

By:  Tupaki Desk   |   8 Feb 2020 2:08 PM GMT
ఢిల్లీలో ముగిసిన పోలింగ్..57.9 శాతం ఓటింగ్
X
దేశవ్యాప్తంగా అమితాసక్తి రేకెత్తించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టమైన పోలింగ్ శనివారం సాయంత్రం ముగిసింది. ఢిల్లీ పరిధిలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా... వాటిలో వివిధ పార్టీలకు చెందిన మొత్తం 672 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. హోరాహోరీగా సాగిన ప్రచారం రెండు రోజుల క్రితమే ముగియగా... తాజాగా శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రి 6 గంటలకు ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం ఓటింగ్ శాతం 57.9 శాతంగా నమోదైనట్లు సమాచారం. పోలింగ్ గడువు ముగిసేసరికి ఇంకా క్యూలలో నిలుచున్న వారికి ఓటు వేసే అవకాశం ఉన్నందున పోలింగ్ శాతం మరి కాస్త పెరిగే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉంటే... ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన గత ఎన్నికల(2015)తో పోలిస్తే.. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం బాగా తగ్గిపోయింది. 2015తో పోలిస్టే 2020 ఎన్నికల్లో ఏకంగా 10 శాతం పోలింగ్ తగ్గిపోయిందని చెప్పాలి. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ నమోదు కాగా... ఇప్పుడు అది 57.9గా నమోదైంది. దీంతో 10 శాతం మంది ఢిల్లీ వాసులు ఈ దఫా పోలింగ్ కేంద్రాల ముఖం చూడలేదన్న మాట. అంటే... మునుపటి మాదిరిగా ఓటు వేసేందుకు చూపిన ఆసక్తి ఢిల్లీలో బాగా తగ్గిపోయిందనే చెప్పక తప్పదు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసీ ముగియగానే.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు జోరందుకున్నారు. ఇదివరకు వచ్చిన సర్వేల మాదిరిగానే ఈ దఫా కూడా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరోమారు విక్టరీ కొట్టేయనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మునుపటి మాదిరిగానే ఈ దఫా కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... ఆప్ ను ఢీకొనేందుకు వేసిన ఎత్తులన్నీ చిత్తయ్యాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఇక హస్తం పార్టీ కాంగ్రెస్ ఎన్నికల పోలింగ్ ప్రారంభానికి ముందే చేతులెత్తేయడం గమనార్హం.