Begin typing your search above and press return to search.

ఉద్యోగులు ఫిఫ్టీ - ఫిఫ్టీ.. వైసీపీ అంచ‌నాలు ఇవే..!

By:  Tupaki Desk   |   28 Jun 2023 6:00 AM GMT
ఉద్యోగులు ఫిఫ్టీ - ఫిఫ్టీ.. వైసీపీ అంచ‌నాలు ఇవే..!
X
రాష్ట్రంలో సుమారు 4 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్న ఉద్యోగుల ఓట్ల‌లో త‌మ‌కు ఫిఫ్టీ ప‌ర్సంట్ ఖాయంగా ప‌డ‌తాయ‌ని వైసీపీ తాజాగా అంచ‌నాకు వ‌చ్చిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. నిజానికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా.. ఈ అంచ‌నాలు త‌ల‌కిందులు అయ్యాయ‌నే చెప్పాలి. 2019 ఎన్నిక‌ల‌కుముందు ఉద్యోగుల‌కు ఇచ్చిన ప్ర‌ధాన‌మైన రెండు డిమాండ్ల‌ను నెర‌వేర్చ‌డంలో సీఎం జ‌గ‌న్ విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న ఉంది.

కీల‌క‌మైన సీపీఎస్ పింఛ‌న్ విధానం ర‌ద్దు.. అదేవిధంగా గతం కంటే మెరుగైన పీఆర్సీ. ఈ రెండు హామీలే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి గుండుగుత్త‌గా ఉద్యోగుల నుంచి ఓట్లు తెచ్చాయి. దీంతో తిరుగులేని విధంగా విజ‌యం ద‌క్కించుకున్నారు వైసీపీ నాయ‌కులు.

అయితే..ఈ రెండు హామీల్లో సీపీఎస్‌ను పూర్తిగా అమ‌లు చేయ‌లేమ‌ని సీఎం త‌ర‌ఫున స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స్ప‌ష్టం చేశారు. దీంతో ఉద్యోగులు గ‌రం అయ్యారు.

ఇక‌, పీఆర్సీ విష‌యంలోనూ.. గ‌తం కంటే.. అంటే చంద్ర‌బాబు ఇచ్చిన 43 శాతం ఫిట్‌మెంట్ కంటే కూడా.. మెరుగ్గా ఇస్తామ‌ని చెప్పినా.. ఈ విష‌యంలోకూడా జ‌గ‌న్ స‌ర్కారు విఫ‌ల‌మై.. దీనిని 27 శాతం ద‌గ్గ‌రే ఆపేసింది.

అయితే.. ఈ రెండు విష‌యాల్లో విఫ‌ల‌మైనందున వుద్యోగులు.. త‌మ‌కు దూరం కావ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నాలు వ‌చ్చాయి. దీంతో అలెర్ట్ అయిన‌.. జ‌గ‌న్ స‌ర్కారు వారిని బుజ్జ‌గించే ప‌నిని వ్యూహాత్మ‌కంగా అమ‌లు చేయ‌డం ప్రారంభించింది.

దీనిలో భాగంగా హుటాహుటిన కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను 2014కు ముందు నియ‌మితులైన వారిని ఇటీవ‌ల క్ర‌మ‌బ‌ద్ధీక‌రించింది. అదేవిధంగా తాజాగా స‌చివాల‌య ఉద్యోగుల‌కు వారానికి 5 రోజుల ప‌నిదినాల‌ను మ‌రోసారి ఏడాది పెంచింది. అదేవిధంగా వారికి ఇస్తున్న రుణాల‌ను పెంచారు.

ఇక‌, సెల‌వుల ఎన్‌క్యాష్ మెంటును కూడా పెంచారు. ఇక‌, జీపీఎస్‌లో మెరుగైన విధానాలు తీసుకువ‌చ్చారు. అదేస‌మ‌యంలో.. ఉద్యోగుల‌కు కారుణ్య నియామ‌కాలు చేస్తున్నారు.

ఇలా.. ఆ రెండు హామీల‌ను అమ‌లు చేయ‌డంలో ఒకింత వెనుక బ‌డినా.. మెరుగైన విధానాలు అమ‌లు చేస్తున్నామ‌ని.. దీంతో ఇప్పుడు ఫిఫ్టీ ప‌ర్సంట్ త‌మ‌కు అనుకూలంగానే ఉంద‌ని అంటున్నారు. మ‌రి చివ‌ర‌కు ఎన్నిక‌ల స‌మయానికి ఏం జ‌రుగుతుందో చూడాలి.