Begin typing your search above and press return to search.

టిక్ టాక్ స్టార్ కు ఎన్నికల్లో షాక్ తప్పలేదు

By:  Tupaki Desk   |   24 Oct 2019 12:01 PM IST
టిక్ టాక్ స్టార్ కు ఎన్నికల్లో షాక్ తప్పలేదు
X
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా మారుతున్నాయి. తొలుత వెలువడిన ట్రెండ్స్ కు భిన్నమైన పరిస్థితి ఏర్పడుతోంది. ఓట్ల లెక్కింపు సాగుతున్న కొద్దీ.. పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తొలుత హర్యానాలో అధికార బీజేపీ అధిక్యతను ప్రదర్శించినా.. సమయం గడుస్తున్న కొద్దీ.. బీజేపీ..కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది.

తొలుత బీజేపీ మెజార్టీలో ఉన్న స్థానాలు ఒక్కొక్కటిగా తగ్గుతూ రావటమే కాదు.. ఇప్పుడు రెండు పార్టీల మధ్య సీట్ల అంతరం తక్కువగా ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. హర్యానా అసెంబ్లీకి బీజేపీ అభ్యర్థుల్లో ఒకరి ఎంపికచాలా చిత్రంగా జరగటమేకాదు.. ఆసక్తికర చర్చ జరిగింది.

సోషల్ మీడియాలో పాపులర్ అయిన టిక్ టాక్ స్టార్ ను బీజేపీ తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. అదంపూర్ స్థానం నుంచి పోటీకి దిగిన టాక్ టాక్స్టార్ సోనాలీ ఫోగట్ ఓట్ల లెక్కింపులో వెనుకబడ్డారు. తన వీడియోలతో భారీ ఎత్తున ప్రజాభిమానాన్ని సాధించుకున్న సోనాలీ.. ఓట్లను రాబట్టుకోవటంలో మాత్రం వెనుకబడ్డారు. ఆమెపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత.. ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉన్న కుల్దీప్ బిష్నోయ్ అధిక్యతలో కొనసాగుతున్నారు.

అనూహ్య పరిణామం జరిగితే తప్పించి సోనాలీ గెలుపు దక్కటం కష్టమేనన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. హర్యానాలోని 90 స్థానాలకు బీజేపీ బీజేపీ 38 స్థానాల్లో అధిక్యతలో ఉండగా.. కాంగ్రెస్ 29 స్థానాల్లో.. ఇతరులు 21 స్థానాల్లో అధిక్యతలో ఉండటం ఆసక్తికరంగా మారింది. ఐఎన్ఎల్ డీ ఒక్క స్థానంలోనే అధిక్యతలో ఉండటం గమనార్హం.