Begin typing your search above and press return to search.

నాలుగు రోజులు.. నలభై యుగాలు

By:  Tupaki Desk   |   7 Dec 2018 4:07 PM GMT
నాలుగు రోజులు.. నలభై యుగాలు
X
తెలంగాణ ఎన్నికల ఘట్టం ముగిసింది. ఓటరు మహాశయులు తమ అభీష్టాన్ని ఏవీఎంలలో భద్రపరిచారు. ఇప్పటి వరకు ప్రజల చెవుల్లో జోరీగల్లాగా మైకుల పట్టుకుని ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టిన నాయకులంతా.. బీపీ టాబ్లెట్స్‌ దిండు కింద పెట్టుకుంటున్నారు. ఎన్నికల చివరి రోజుల్లో డబ్బు డబ్బు అంటూ కొట్టుకున్న నాయకుల గుండె కాస్తా.. పోలింగ్‌ ముగిశాక లబ్‌ డబ్‌ అంటూ వేగం పెంచింది. పోటీలో నిలిచిన నాయకులు, ఆయా పార్టీలకు నాలుగు రోజుల కాలం నలభై యుగాలుగా మారింది.

మరో వైపు ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యాన్ని ఎగ్జిట్‌పోల్స్‌ ముందే తేల్చేస్తున్నాయి. నియోజవర్గాల వారీగా గెలిచే అభ్యర్థులెవరో నిర్ణయించేస్తున్నాయి. అధిక శాతం పోల్స్‌ టీఆర్‌ఎస్‌ వైపే ప్రజల నాడి ఉందంటూ లెక్కలు వేసేస్తున్నాయి. లగడపాటి రాజగోపాల్‌ వంటి సర్వేలలో సర్వాంతర్యామిలు మాత్రం ప్రజాకూటమికి విజయం తథ్యమని కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఇలా అభ్యర్థులను విజయాల ఊహల పల్లకిలో కొన్ని సర్వేలు ఊయలలూపుతుంటే.. మరి కొన్ని సర్వేలు మాత్రం అపజయాల అగాధంలోకి తోసేస్తున్నాయి.

ఎవరెన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు మాత్రం అధికార పార్టీ వైపే కొంత మొగ్గు చూపుతున్నట్లు సామాన్య ఓటరు స్పష్టం చేస్తున్నారు. సహజంగా ఐదేళ్ల పాలనతో ఉన్న పార్టీపై కొంత వ్యతిరేకత ఉంటుందనేది జగమెరిగిన సత్యం. అయితే తెలంగాణలో ఈ ప్రభావం ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ చారిత్రాత్మక తప్పిదం చేసిందని రాజకీయ మేధావులు అంటున్నారు. బద్ధ శత్రువైన తెలుగుదేశం పార్టీతో వారు పొత్తు పెట్టుకుని.. చంద్రబాబు మాయలో పడి జవసత్వాలు ఉడికిపోయారని.. ఇలాంటి వారు ఐదేళ్ల పాలన ఎలా గట్టెక్కిస్తారని ప్రజలే ప్రశ్నిస్తున్నారు.

చివరకు కాంగ్రెస్‌ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సైతం చంద్రబాబు తానే వెలగబెట్టానని చెబుతున్నా.. నోరెత్తలేని అసమర్థులను ఎలా సమర్థించగలమని పేర్కొంటున్నారు. ఇదంతా ఓట్ల రూపంలో తమ నిర్ణయాలన్ని వెలువరించామని కొందరు బాహాటంగానే చెబుతున్నారు. లగడపాటి వంటి నేతలు ఇప్పటికే ప్రజాకూటమికి అనుకూల తీర్పు ఇచ్చినా.. గతంలో ఆయన టీఆర్‌ఎస్‌ గెలుస్తుందంటూ కేటీఆర్‌కు పంపిన సందేశం బయటకు రావడంతో లగడపాటి సర్వే కాస్తా.. జగడపాటిగా మారింది.

స్వతంత్రులే కీలకం

అన్ని సర్వేల సారాంశం ప్రకారం మధ్యస్తంగా తీసుకున్నా స్వతంత్రులే కీలకం కానున్నారు. వీరితోపాటు ఈసారి భారతీయ జనతాపార్టీ రెండకెల స్కోరు చేయపోయినప్పటికీ నిర్ణయాత్మకమైన శక్తిగా మారుతుందని పోల్స్‌ జోస్యం చెబుతున్నాయి. ఇదే నిజమైతే తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ.. ప్రజాకూటమికి మధ్య పొసగదు కాబట్టి.. రాజకీయ అవసరం మేరకు.. ఆ పార్టీ నేతలు కారెక్కవచ్చు. అదే సమయంలో స్వతంత్రులు తమ వైపు ఉన్నారని టీఆర్‌ఎస్‌ ఆశలు పెట్టుకుంది. ఇదే నిజమైతే.. కాంగ్రెస్‌ పార్టీ మరోసారి బొక్క బోర్లా పడుతుంది. దీనంతటికి కారణమైన తెలుగుదేశం పార్టీ నిజస్వరూపం.. చంద్రబాబు బలం.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు దేశ వ్యాప్తంగా తెలిసిపోతుంది. ఇప్పటికే దేశాన్ని ఉద్దరిస్తానని తిరుగుతున్న చంద్రబాబు నాయుడుకు ఈ ఫలితాలు పక్కలో బల్లెంలా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఓటమి రుచి చూపిస్తాయని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది.