Begin typing your search above and press return to search.

రేవంత్‌ ను బుక్ చేసేందుకే రంగంలోకి ఈడీ

By:  Tupaki Desk   |   2 Feb 2019 5:48 AM GMT
రేవంత్‌ ను బుక్ చేసేందుకే రంగంలోకి ఈడీ
X
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మరోసారి కదలిక వచ్చింది. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌ రెడ్డిని విచారణ కోసం తమ ముందు హాజరుకావాలని ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో ధీర్ఘకాలంగా స్థబ్ధంగా ఉన్న ఈకేసులో తిరిగి చలనం వచ్చినట్టయ్యింది. అయితే, ఈ ఎపిసోడ్ వెనుక అస‌లు టార్గెట్ కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అని అంటున్నారు.

దాదాపు నాలుగేళ్ల‌ క్రితం టీడీపీ నేత‌గా ఉన్న‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌ రెడ్డి గెలుపు కోసం టీఆర్ ఎస్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌ ఓటు కోసం రూ. 50 లక్షలు ఇస్తూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పూర్తిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలిసే జరిగిందని - అందుకు ఆయన స్టీఫెన్‌ సన్‌ తో మాట్లాడిన ఆడియో టేప్‌ ను టీఆర్ ఎస్‌ నాయకులు బయటపెట్టడంతో ఆ సమయంలో సంచలనం రేపింది. అంతేగాక రేవంత్‌ తో పాటు మరో టీడీపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య - మరో ఐదుగురిని కూడా ఏసీబీ నిందితుల జాబితాలో చేర్చింది. అయితే ఈ కేసులో తాను నిర్ధోషినంటూ జెరూసలెం మత్తయ్య హైకోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకోగా, దానిపై ఏసీబీ సుప్రింకోర్టులో సవాల్‌ చేయడంతో అక్కడ ఈ అంశం విచారణలో ఉంది. మరో వైపు ఏపీ ముఖ్యమంత్రిని కూడా ఈ కేసులో విచారించాలని కోరుతూ ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన వ్యాజ్యంపైనా విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే స్టీఫెన్‌ సన్‌ ఓటును ఖరీదు చేయడానికి ఇవ్వజూపిన దాదాపు నాలుగు కోట్లలో రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి - ఎవరు డబ్బును సమకూర్చారు - ఎక్కడి నుంచి ఆ డబ్బు తెచ్చారనే కోణంలో ఏసీబీ దర్యాప్తు సాగింది.

ఈ ద‌ర్యాప్తు ఊహించ‌ని మ‌లుపు తిరిగి - సుధీర్ఘంగా సాగిన దర్యాప్తులో చివరికి ఈ డబ్బు హవాలా రూపంలో విదేశాల నుంచి టీడీపీ నాయకులు సమకూర్చారని ఏసీబీకి కొంత ఆధారాలు చిక్కినట్టు సమాచారం. దీంతో ఈ దిశగా ఈ కేసును దర్యాప్తు జరపాలని కోరుతూ రాష్ట్ర ఏసీబీ కేంద్ర హోంశాఖకు - ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ కు లేఖ రాసింది. దీంతో ఈడీ అధికారులు ఈ దిశగా రంగంలోకి దిగి ప్రస్తుతం కాంగ్రెస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా ఉన్న రేవంత్‌ రెడ్డికి గతంలో నోటీసులు జారీ చేసి విచారించారు. తాజాగా టీడీపి నాయకుడు వేం నరేందర్‌ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల లోపు తమ ముందు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నట్టు తెలిసింది. స్టీఫెన్‌ సన్‌ కోసం సమాకూర్చిన రూ.50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని - వాటిని ఎవరు సమకూర్చారని - హవాలా రూపంలో వచ్చిన సమాచారంలో నిజా నిజాల గురించి వేం నరేందర్‌ రెడ్డిని ఈడీ విచారించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒక పక్క పార్లమెంటుతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల నగారా త్వరలో మోగనున్న నేపథ్యంలో ఈడీ తన దూకుడును పెంచడంతోఈ కేసు ఎటు తిరిగి ఎటు దారి తీస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అదే స‌మ‌యంలో పార్ల‌మెంటు బ‌రిలో నిల‌వాల‌ని భావిస్తున్న రేవంత్ రెడ్డి ల‌క్ష్యంగా ఈ విచార‌ణ జ‌రుగుతోంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.