Begin typing your search above and press return to search.

విపత్తు వేళ కదిలొచ్చిన యువత

By:  Tupaki Desk   |   3 Jun 2023 3:00 PM GMT
విపత్తు వేళ కదిలొచ్చిన యువత
X
ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొన్న ఘటన వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఆపద సమయంలో కొందరు స్థానికులు మానవత్వాన్ని చాటుకున్నారు. గాయపడిన వారికి రక్తం అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.

బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద జరిగిన ఈ విషాద ఘటనలో 238 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 900 మందికి పైనే గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే ఈ పరిస్థితుల్లో గాయపడిన వారికి రక్తం అవసరం ఉంటుందని ఆలోచించిన వందలాదిమంది యువకులు ముందుకు వచ్చారు.

మానవత్వాన్ని చాటారు. వారంత నిన్న రాత్రే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని రక్త దానం చేశారు. వీరంతా ఏ పిలుపు లేకుండానే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుకున్నారని స్థానికులు అంటున్నారు. గాయపడిన వారికోసం రిస్క్ తీసుకుని మరి వచ్చి రక్తదానం చేశారు. స్థానికులు సైతం ఘటన స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ప్రమాదం గురించి తెలియగానే వెంటనే అక్కడకు బయల్దేరామని ఓ స్థానికుడు చెప్పుకొచ్చాడు. దాదాపు 200-300 మందిని కాపాడగలిగామన్నారు.ప్రమాద స్థలంలో భారత సైన్యం ముమ్మర సహాయక చర్యలు చేపట్టింది. బోగీల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి శరవేగంగా ఆసుపత్రులకు తరలించింది. 200 అంబులెన్స్‌ లను ఘటనాస్థలంలో ఏర్పాటు చేయగా.. ఇందులో 167 వరకు 108 వాహనాలు కాగా.. 20కి పైగా ప్రభుత్వ అంబులెన్స్‌లు ఉన్నాయి. వీటితో పాటు 45 మొబైల్‌ హెల్త్‌ బృందాలు ఘటనాస్థలంలో అందుబాటులో ఉన్నాయి.

అదనంగా మరో 50 మంది వైద్యులను కూడా పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయంశమైంది. దాదాపు 238 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. గాయపడిన వారికోసం ముందుకు వచ్చిన యువత.. తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటన బాధితుల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.