Begin typing your search above and press return to search.

డాన్ ను పట్టుకుంది కేంద్రమంత్రా?

By:  Tupaki Desk   |   27 Oct 2015 5:49 AM GMT
డాన్ ను పట్టుకుంది కేంద్రమంత్రా?
X
బాలీవుడ్ చిత్రాన్ని తీసిపోని విధంగా ఉంది తాజా వ్యవహారం. తన మాటలతో పీకల్లోతు సమస్యల్లో చిక్కకున్న కేంద్రమంత్రి కాస్తా ఇప్పుడు జేమ్స్ బాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. కుక్క మీద ఎవరో రాయి విసిరితే దానికి కేంద్రం బాధ్యత వహించాలా అంటూ సంబంధం లేని పోలిక తీసుకొచ్చి దేశ వ్యాప్తంగా విమర్శల్ని ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి వీకే సింగ్ ఇప్పుడు ‘హీరో’ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. మాఫియా డాన్ ఛోటా రాజన్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవటంలో వీకే సింగ్ ‘జేమ్స్ బాండ్’ పాత్ర పోషించారని చెబుతున్నారు.

దాదాపుగా రెండు దశాబ్దాలుగా పలు దేశాలకు కొరుకుడుపడని మాఫియా డాన్ ఛోటా రాజన్ ఇండోనేషియాలోని బాలిలో అరెస్ట్ కావటం తెలిసిందే. ముంబయిలో బ్లాక్ టిక్కెట్ల అమ్మకం నుంచి మాఫియా డాన్ వరకూ ఎదిగిన ఇతగాడు పోలీసుల అదుపులోకి తీసుకోవటంలో కేంద్రమంత్రి వీకే సింగ్ కీలకపాత్ర పోషించారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రముఖులను.. సంపన్నులను బెదిరించటం. వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బు గుంజటం.. ముంబయిలోని పలు నేరాలకు.. దారుణాలకు ఛోటా రాజన్ హస్తం ఉంటుంది. అలాంటి కరుడుగట్టిన డాన్ ను టార్గెట్ చేసి.. అతన్ని పోలీసులు పట్టుకునేలా చేయటానికి వీకే సింగ్ అన్నీ తానై చేశారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికారికంగా ఈ విషయాల్ని వెల్లడించనప్పటికీ.. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఛోటా రాజన్ ను అదుపులోకి తీసుకోవటంలో మాజీ సైనికాధికారి అయిన కేంద్రమంత్రి ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు చెబుతున్నారు.

ఆస్ట్రేలియా నుంచి ఇండోనేషియాకు ఛోటా రాజన్ బయలుదేరారన్న విశ్వసనీయ సమాచారంతో అలెర్ట్ అయిన వీకే సింగ్.. అతడికి సంబంధించిన సమాచారాన్ని ఇంటర్ పోల్ కి ఇవ్వటంతో పాటు.. ఆస్ట్రేలియా.. ఇండోనేషియా పోలీసుల్ని సమన్వయం చేసుకుంటూ డాన్ ను పట్టుకోవటంలో కీ రోల్ ప్లే చేశారట. మొత్తం ఆపరేషన్ ను గుట్టుగా కానిచ్చేయటమే కాదు.. హుటాహుటిన ఇండోనేషియా వెళ్లిన ఆయన.. మూడు రోజులు మకాం వేసిన ఆయన.. అండర్ వరల్డ్ డాన్ కు ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ట్రాప్ చేయటం విశేషం. కేంద్రమంత్రి స్థానంలో ఉన్న నేత ఒకరు ఇలాంటి జేమ్స్ బాండ్ వ్యవహారాలు చేయటం గొప్పేనన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజా ఉదంతం నేపథ్యంలో కేంద్రమంత్రులందు.. వీకే సింగ్ వేరయా అనాలేమో.