Begin typing your search above and press return to search.

అనుకున్న‌ట్లే జ‌రిగింది..దిన‌క‌ర‌న్ అరెస్ట్ అయ్యాడు

By:  Tupaki Desk   |   26 April 2017 5:26 AM GMT
అనుకున్న‌ట్లే జ‌రిగింది..దిన‌క‌ర‌న్ అరెస్ట్ అయ్యాడు
X
అనుకున్న‌దే జ‌రిగింది. అరెస్ట్ ఖాయ‌మ‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మైన చిన్న‌మ్మ శ‌శిక‌ళ అక్క కుమారుడు.. అన్నాడీఎంకే (అమ్మ‌)నేత టీటీవీ దిన‌క‌ర‌న్ తాజాగా అరెస్ట్ అయ్యారు. రెండాకుల గుర్తును సొంతం చేసుకోవ‌టం కోసం కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి రూ.50 కోట్ల మేర లంచం ఇచ్చేందుకు భారీ ఎత్తున పావులు క‌దిపేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల్ని ఢిల్లీ పోలీసులు గుర్తించి.. ఆ కుట్ర‌ను ర‌ట్టు చేయ‌టం తెలిసిందే. ఈ ఉదంతంలో దిన‌క‌ర‌న్ కు సాయం చేసేందుకు సిద్ధ‌మైన బ్రోక‌ర్ సుఖేశ్ చంద్ర‌శేఖ‌ర్ ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవ‌టం.. తీగ లాగితే డొంక మొత్తం క‌ద‌ల‌టం.. దిన‌క‌ర‌న్ చిక్కుల్లో ప‌డ‌టం ఒక‌టి త‌ర్వాత మ‌రొక‌టిగా వేగంగా సాగిపోయాయి. నాలుగు రోజుల్లో 36 గంట‌ల పాటు సుదీర్ఘ విచార‌ణ‌ను ఎదుర్కొన్న ఆయ‌న‌.. చివ‌ర‌కు ఈ ఉదంతంలో అరెస్ట్ కాక త‌ప్ప‌లేదు.

రెండాకుల్ని ర‌క్షించుకునే క్ర‌మంలో.. దిన‌క‌ర‌న్ బుక్ కావ‌టం విశేషం. ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. అధికార అన్నాడీఎంకే పార్టీ ముక్క‌లు కావ‌టం.. ఈ నేప‌థ్యంలోపార్టీ గుర్తును త‌మ ద‌గ్గ‌ర ఉంచుకునేందుకు దిన‌క‌ర‌న్ చేసిన లోగుట్టు ప్ర‌య‌త్నాల్ని ఢిల్లీ పోలీసులు ర‌ట్టు చేయ‌ట‌మే కాదు.. తాజాగా ఆయ‌న్ను అరెస్ట్ చేసిన వైనం రాజ‌కీయ సంచ‌ల‌నంగా మారింది. లంచం ఇవ్వ‌చూపిన ఆరోప‌ణ‌ల మీద గ‌డిచిన నాలుగు రోజులుగా దిన‌క‌ర‌న్ ను ప్ర‌శ్నిస్తున్న పోలీసులు.. తొలి రోజు ఏడు గంట‌లు.. రెండోరోజు 10 గంట‌లు.. మూడో రోజు తొమ్మిది గంట‌లు.. నాలుగోరోజు 10గంట‌ల పాటు ప్ర‌శ్నించారు.

మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌ల నుంచి చాణ‌క్య‌పురి క్రైం బ్రాంచ్ ఇంట‌ర్ స్టేట్ కార్యాల‌యంలో విచారించిన అధికారులు.. అర్థ‌రాత్రి వేళ‌లో ఆయ‌న్ను అరెస్ట్ చేసిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. దిన‌క‌ర‌న్ ను తాము అరెస్ట్ చేసిన‌ట్లుగా జాయింట్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీసు (క్రైం) రంజ‌న్ మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి 11.52 గంట‌ల వేళ‌లో అరెస్ట్ చేసిన‌ట్లుగా ప్ర‌క‌టించారు.

త‌న మీద ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్లుగా బ్రోక‌ర్ సుఖేశ్ ను తాను క‌లిసిన మాట నిజ‌మే అయినా.. తాను అత‌నికి ఎలాంటి డ‌బ్బు ఇవ్వ‌లేద‌ని వాదించిన‌ట్లుగా తెలిసింది. నిజానికి మొద‌ట్లో సుఖేశ్ ఎవ‌రో త‌న‌కు తెలీద‌ని.. అత‌డితో త‌న‌కుఎలాంటి సంబంధాలు లేవ‌ని చెప్పిన దిన‌క‌ర‌న్‌.. వ‌రుస విచార‌ణ అనంత‌రం.. సుఖేశ్‌తో మాట్లాడిన వైనాన్ని క‌న్ఫ‌ర్మ్ చేయ‌టం గ‌మ‌నార్హం.

దిన‌క‌ర‌న్ తో పాటు.. అత‌డి స్నేహితుడు మ‌ల్లికార్జున్ ను కూడా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. దిన‌క‌ర‌న్ అరెస్ట్ తో త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకోనున్న‌ట్లుగా చెబుతున్నారు. మ‌రోవైపు.. బీజేపీ ప్ర‌భుత్వంతో ప‌న్నీర్ సెల్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే.. దిన‌క‌ర‌న్ అరెస్ట్ గా ఆయ‌న వ‌ర్గానికి చెందిన నేత‌లు చెబుతున్నారు. బ్రోక‌ర్ సుఖేశ్ ను కోర్టుకు స‌మ‌ర్పించిన క్ర‌మంలో.. దిన‌క‌రన్ పై ఎలాంటి చ‌ర్య‌లు ఎందుకు తీసుకోవ‌టం లేదంటూ కోర్టు ప్ర‌శ్నించిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఆయ‌న్ను పోలీసులు అరెస్ట్ చేయ‌టం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/