Begin typing your search above and press return to search.

ఇదేం బుద్ధి? 13 ఏళ్లుగా భార్యను బయటకు రానివ్వని విజయనగరం లాయర్ భర్త

By:  Tupaki Desk   |   2 March 2023 12:18 PM GMT
ఇదేం బుద్ధి? 13 ఏళ్లుగా భార్యను బయటకు రానివ్వని విజయనగరం లాయర్ భర్త
X
ఇటీవల బయటకు వస్తున్న కొన్ని ఉదంతాలను చూస్తే.. నిజంగా ఇలాంటివి జరుగుతున్నాయా? అని ముక్కున వేలేసుకునే పరిస్థితి. విన్నంతనే అస్సలు నమ్మలేని రీతిలో ఉన్న ఈ వ్యవహారం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అదేమంటే.. ఒక భర్త తన భార్యను గడిచిన పదమూడేళ్లుగా ఇంట్లో నుంచి బయటకు రానివ్వని వైనం చోటు చేసుకుంది.

చివరకు భార్య తరపు కుటుంబీకులు కోర్టును ఆశ్రయించి ఆదేశాల్ని తీసుకురావటం ద్వారా ఆమె బయటకు వచ్చిన పరిస్థితి. ఈ అసాధారణ ఉదంతం విజయనగరం పట్టణంలో చోటు చేసుకోవటం గమనార్హం.

విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన వ్యక్తి న్యాయవాదిగా పని చేస్తుంటారు. అతడికి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఒక మహిళతో 2008లో పెళ్లైంది. అనంతరం ప్రసవానికి పుట్టింటికి వచ్చిన ఆమె కుమార్తెకు జన్మనిచ్చిన తర్వాత అత్తారింటికి వచ్చేసింది.

కట్ చేస్తే.. గడిచిన పదమూడేళ్లుగా ఆమెను బయటకురానివ్వకపోవటం.. ఆమెకు ఇద్దరుపిల్లలు పుట్టినా.. ఆ విషయాల్నితెలీకుండా ఉన్న వైనంపై ఆమె తండ్రి మనోవ్యధకు గురై అనారోగ్యానికి గురయ్యారు. దీంతో.. అమ్మాయి తల్లి స్పందనకార్యక్రమంలో భాగంగా అనంత ఎస్పీ దీపికను కలిసి ఫిర్యాదు చేశారు.

దీంతో.. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లగా.. కోర్టు ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. దీంతో.. వెనక్కి వచ్చిన పోలీసులు.. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ఉదంతం గురించి విన్నంతనే సదరు న్యాయమూర్తి ఇంట్లో తనిఖీ చేసేందుకు అనుమతులు ఇచ్చారు. కోర్టు ఆదేశాలను తీసుకెళ్లిన పోలీసులకు సదరు లాయర్ భర్త స్పందించకపోవటంతో కాసేపు ఆగిన తర్వాత ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు.. తనిఖీలు నిర్వహించారు.

చివరకు ఆమెను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. పదమూడేళ్ల తర్వాత తన తల్లిని సోదరుడ్ని కలిసిన వేళ.. ఆమె చాలా ఆనందానికి గురైంది. ఆమెను తీసుకొచ్చి కోర్టు ముందు హాజరుపరిచారు. ప్రస్తుతానికి ఆమెను తల్లిదండ్రులకు అప్పగించాలని.. ఈ రోజు (గురువారం) ఇరు కుటుంబాల వారిని న్యాయ సేవాధికార సంస్థ ఎదుట హాజరుపర్చాలని న్యాయమూర్తి సూచించారు. ఏమైనా.. పదమూడేళ్ల పాటు పుట్టింటి వారిని చూపించకుండా ఉండిపోయిన భర్త విషయంలో సదరు భార్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.