ఉక్కు కధ క్లైమాక్స్ కి : ఫినిషింగ్ టచ్ ఉంటుందా...?

Fri May 13 2022 14:00:01 GMT+0530 (IST)

vizag steel plant news update

విశాఖ ఉక్కు కర్మాగారం. ఎందరో అమరవీరుల త్యాగ ఫలం. ఏకంగా ముప్పయి రెండు మంది  పోరాటయోధులు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని ఆత్మ బలిదానం చేసుకున్న ఘటన దేశంలో ఎక్కడైనా ఉందా. నిజానికి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడమన్నవి  ప్రభుత్వాల  పాలసీ డెసిషన్స్ గా ఉంటాయి. అలాంటిది తమ ప్రాంతానికి మంచి జరగాలని కోరుతూ నాటి యువతరం  నిండు జీవితాలను అర్పించుకుంది. అలా త్యాగాల పునాది మీద వెలసిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని లెక్కలేనితనంతో కేంద్రం గత ఏడాది  అమ్మకానికి పెట్టింది. వందకు వంద శాతం ఉక్కుని అమ్మేస్తామని కూడా కేంద్రం ధీమాగా చెబుతోంది.దీని మీద నిండు సభలో ఉక్కు మంత్రి అయితే మేము నష్టాలలో ఉన్న విశాఖ ఉక్కుని అసలు భరించలేమని తేల్చేశారు. ఇంత గట్టిగా చెప్పాక ఉక్కు మీద నమ్మకాలు ఏముంటాయి. కానీ ఉద్యమకారులు మాత్రం ఏడాది గడచినా మొక్కవోని దీక్షతో ఉక్కు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ప్రైవేట్ బారి నుంచి కాపాడుకుంటామని కూడా ప్రతిజ్ఞ చేస్తున్నారు.

రిలే దీక్షలతో పాటు అనేక రకాలైన ఆందోళనలు ఒక వైపు సాగుతూండగానే కేంద్రం తన దూకుడుని ఏ మాత్రం తగ్గించుకోవడంలేదు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేసే విధయంలో మరో లాంచనాన్ని కూడా కేంద్రం తాజాగా పూర్తి చేసింది. అదేంటి అంటే విశాఖ ఉక్కు ఆస్తులను మదింపు చేయడానికి ఒక సంస్థకు టెండర్లు పిలిచి మరీ బాధ్యతలు అప్పగించింది. ఇందుకోసం బిడ్ ని ఆహ్వానిస్తే పది సంస్థలు పాల్గొన్నాయి. అందులో నుంచి జీఏఏ సంస్థను ఖరారు చేసింది.

ఇక ఈ సంస్థ విశాఖ ఉక్కు ఆస్తులు ఎన్నో తేల్చబోతుంది అన్న మాట. ఈ సంస్థ ఇచ్చే నివేదికను అనుసరించి విశాఖ ఉక్కుని ఎంతకు అమ్మాలన్నది కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయానికి వస్తుంది అంటున్నారు. అంటే విశాఖ ఉక్కుని వదిలించుకునే విషయంలో ఇది కీలకమైన ఘట్టంగానే చెబుతున్నారు. విశాఖ ఉక్కుకు ఈ రోజుకు దాదాపుగా ఇరవై వేల ఎకరాలు భూమి ఉంది. అలాగే ఇంఫ్రా స్ట్రక్చర్ ఉంది. అదే విధంగా ఉక్కుకు ఆస్తులు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి.

ఇవన్నీ కనుక మదింపు చేస్తే కచ్చితంగా  రెండు లక్షల కోట్లకు పైగా ఆస్తులు విశాఖ ఉక్కు సొంతం అని కార్మిక లోకం అంటోంది. అలాంటి ఉక్కుని కేవలం ముప్పయి వేల కోట్లకు అమ్మేయడానికే ఈ తతంగం అంతా అని ఉద్యమకారులు గర్జిస్తున్నారు. ఇంకో వైపు చూస్తే విశాఖ ఉక్కు అమ్మకం విషయంలో కేంద్రం వెనక్కి తగ్గమని అంటూంటే కార్మిక లోకం మేము కూడా తగ్గేది లేదు అంటోంది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ సమయంలో స్పందించాలని కూడా కోరుతోంది. అలాగే అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం సహా అన్ని పార్టీలు కలసి అఖిలపక్షంగా ఏర్పాటు చేసుకుని కేంద్రం మీద దండెత్తాలని కూడా ఉక్కు కార్మికులు కోరుతున్నారు. విశాఖ ఉక్కుని ఈ దశలో అయినా కాపాడుకోకపోతే మాత్రం ఇక చరిత్రలో ఇంతకంటే చీకటి రోజు వేరొకటి ఉండదని అంటున్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ఉండబట్టే విశాఖకు ఇంతటి ఖ్యాతి కూడా దక్కిందని అలాంటి ప్లాంట్ ని ఎవరికో కట్టబెట్టి ఉక్కు నగరానికి ఉన్న సార్ధక నామధేయాన్ని లేకుండా కాకుండా చేస్తే మాత్రం చరిత్ర క్షమించదు అని అంటున్నారు. చూడాలి మరి ఈ పోరులో కార్మికులు గెలవాలనే అంతా కోరుకుంటున్నారు.