Begin typing your search above and press return to search.

ఉక్కు విషయంలో ఆ ఒక్క మాట ?

By:  Tupaki Desk   |   20 Nov 2021 1:30 AM GMT
ఉక్కు విషయంలో ఆ ఒక్క మాట ?
X
ప్రధాని నరేంద్ర మోడీ ఏడేళ్ల ప్రధానిమంత్రిత్వంలో తన వైఖరికి భిన్నంగా అందరికీ షాక్ ఇస్తూ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా పదిహేను నెలలుగా రగులుతున్న మూడు వివాదాస్పద సాగునీటి చట్టాల మీద ఆయన తలాఖ్ అనేశారు. ఈ రోజుతో అవి వద్దు, ఇక రద్దు అని చాలా సింపుల్ గా చెప్పేశారు.

పొద్దు పొద్దున్నే మోడీ టీవీ ముందుకు వచ్చారేంటి అని జాతి జనులు అంతా సంభ్రమాశ్చర్యాలతో చూస్తూండగానే అంతకు మించిన ఆశ్చర్యానికి గురిచేసే వార్తను విప్పి చెప్పేశారు. మొత్తానికి జై కిసాన్ అని మోడీ అనేశారు. రైతే రాజు అని ఎంతో కాలంగా నినాదాలు వినిపించినా సరిగ్గా ఈ వేళలో మాత్రం అది నిజం అనిపించేలా మోడీ వారికి సలాం కొట్టారు.

నిజంగా మూడు సాగునీటి చట్టాల విషయంలో దేశంలో ఎంతో పోరాటం జరిగింది. ఏడు వందల మంది దాకా రైతులు బలి అయ్యారు. పదిహేను మంది వరకూ న్యాయవాదులు కూడా కన్నుమూశారు. ఇక ఆసేతు హిమాచలం దాకా సెగను రగిలించడంతో కర్షకులు సక్సెస్ అయ్యారు.

మొత్తానికి రైతు ఉద్యమ ధాటికి తగ్గుటయే ఎరుగని మోడీ సర్కార్ బాగా తగ్గిపోయింది. మరి దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయా లేక ఇంకేమైనా అన్న చర్చ అయితే ఉన్నా కానీ విజయం మాత్రం రైతుల ఖాతాలోనే పోతుంది. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరాది రాష్ట్రాలలో ఫలితాలు బీజేపీకి గట్టి దెబ్బేసేలా ఉన్నాయన్న అంచనాల నేపధ్యంలోనే మోడీ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారు అని కూడా ఉంది.

ఇవన్నీ పక్కన పెడితే మోడీ ఒకసారి డెసిషన్ తీసుకుంటే వెనక్కు తగ్గరు, అది అసాధ్యం అన్న మాటలైతే ఇక ఇపుడు వినిపించవంతే. దాంతో మోడీ కూడా తన నిర్ణయాలను తిరగతోడుతారు అన్న విశ్వాసం అయితే జనాలకు వచ్చింది. ఈ క్రమంలో ఏపీకి గర్వకారణం అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఈ విషయంలో ఎవరేమి చెప్పినా వినేది లేదు అంటూ కేంద్ర పెద్దలు ఈ రోజు దాకా బింకాన్ని ప్రదర్శించారు. కానీ ఇపుడు సాగు నీటి చట్టాల రద్దుతో ఢిల్లీలో సీన్ మారిపోయింది. మోడీ కచ్చితంగా మాట వింటారు, జనాల ఆవేదనను అర్ధం చేసుకుంటారు అన్న నమ్మకాన్ని విశాఖ ఉక్కు ఉద్యమ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి.

దాంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయవద్దు మోడీజీ అని వారు కోరుతున్నారు. రైతులకు ఏ విధంగా ఊరటను కలిగించారో అదే విధంగా కార్మికులకు కూడా భరోసా ఇచ్చేలా విశాఖ స్టీల్ ని నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికీ మించిపోయింది లేదని అంతా కలసి ఒకసారి మోడీ దగ్గరకు వెళ్లి విన్నపాలు చేసుకుంటే ఆయన కరుణిస్తాడు అన్న నమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి స్టీల్ ప్లాంట్ విషయంలో మోడీ ఆలోచించాలని, ఏపీకి శాశ్వత గర్వంగా దానిని కొనసాగించాలని అంతా కోరుతున్నారు. ఈ విషయంలో మోడీ మాస్టార్ ని తగ్గేలా చేసే బాధ్యతని ఏపీ బీజేపీ నాయకులు స్వీకరించాలని కూడా విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. చూద్దాం మరి మోడీ ఏమంటారో.