Begin typing your search above and press return to search.

వైజాగ్ స్టీల్ః ఎలా ప్రైవేటీక‌రిస్తారు? ఉద్యోగులు ఎటు? జింక్ సంస్థ‌ను ఏం చేశారు?

By:  Tupaki Desk   |   10 Feb 2021 9:49 AM GMT
వైజాగ్ స్టీల్ః ఎలా ప్రైవేటీక‌రిస్తారు? ఉద్యోగులు ఎటు? జింక్ సంస్థ‌ను ఏం చేశారు?
X
విశాఖ‌లోని ఉక్కు ఫ్యాక్ట‌రీని ప్రైవేటుపరం చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రుల హ‌క్కుగా కార్మికులు భావించే ఈ ఫ్యాక్ట‌రీపై దాదాపు.. 1200 చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు ఆధార‌ప‌డి ఉన్నాయి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో.. ఇక్కడి పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి ఏమవుతాయోనని స్థానికులు తీవ్ర‌ అందోళన చెందుతున్నారు. ఈ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ఉద్య‌మాల‌కు కూడా సిద్ధ‌మ‌వుతున్నారు. దీనిపై ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న ఏమైనా చేస్తుందా? లేదా? అన్న‌ది చూడాలి. అయితే.. ఒక‌వేళ ప్రైవేటీక‌ర‌ణ‌కే మొగ్గు చూపితే.. ఏం జ‌రుగుతుంది? ఎలా ప్రైవేటు ప‌రం చేస్తారు? గ‌త అనుభవాలు ఏం చెప్తున్నాయి? అనేది చూద్దాం.

హిందుస్థాన్ జింక్ మాదిరి‌గా...
విశాఖలో 1974లో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ప్రారంభమైంది. ఈ కర్మాగారం కోసం పాతగాజుకవాక, మింది, నక్కవానిపాలెం, ములగాడ పరిసర ప్రాంతాల రైతుల నుంచి అప్పట్లో 350 ఎకరాల భూమిని సేక‌రించింది ప్ర‌భుత్వం. ఆ త‌ర్వాత ఫ్యాక్ట‌రీ నిర్మాణం జ‌రిగింది. నిర్వాసితుల‌కు ఉద్యోగాలు ద‌క్కాయి. ఆ త‌ర్వాత 2002లో ప్ర‌భుత్వం ఈ సంస్థ‌ను ప్రైవేటీక‌రించ‌డానికి సిద్ధ‌ప‌డింది. 2004లో స్వచ్ఛంద పదవి విరమణ (వీఆర్ ఎస్‌) తెర‌పైకి తెచ్చారు. అప్పటికి మొత్తం 2,100 మంది ఉద్యోగులు.. దాదాపు మూడు వేల మంది రోజువారి కూలీలు ఉన్నారని అందులో ప‌నిచేసిన ఉద్యోగి తెలిపారు. క్ర‌మంగా చాలా మందికి వీఆర్ ఎస్ ఇప్పించి, జింక్ కంపెనీలోని ప్రభుత్వ వాటాని 70 శాతం వేదాంత గ్రూపుకి అమ్మేశారని తెలిపారు ఆ ఉద్యోగి.

ఆ భూములు ఎక‌రం రూ.8 కోట్లు..
మిగిలిన వారిని కూడా బెదిరించి, బుజ్జ‌గించి వీఆర్ ఎస్ ఇప్పించార‌ట‌. దీంతో.. 2013 నాటికి అంద‌రూ వీఆర్ఎస్ తీసుకున్నారు. దాంతో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ పూర్తిగా మూతపడింది. ఇప్పుడు ఆ భూముల‌తో ఆ సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని స‌ద‌రు ఉద్యోగి తెలిపారు. ఇప్పుడక్కడ ఎకరం రూ.8 కోట్లు పలుకుతోందని స‌మాచారం. ఆ ఫ్యాక్ట‌రీకి చెందిన మొత్తం 350 ఎకరాలను ఆ సంస్థ పొందిందని వెల్ల‌డించారు. ఇప్పుడు వైజాగ్ స్టీల్స్ ను ప్రైవేటు ప‌రం చేస్తే.. జ‌రిగే అదే అని ఆయ‌న ఆవేద‌న‌తో చెప్ప‌డం గ‌మ‌నార్హం.

రెండేళ్ల లోనే ఖ‌తం..
అయితే.. స్టీల్ ప్లాంట్ వంటి భారీ ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేయడం అంత సులభం కాదని రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జా సంఘాలు అంటున్నాయి. కానీ.. అసాధ్యం కూడా కాదని అంటున్నారు ప‌లువురు. ప్ర‌భుత్వం దిగి రాకుంటే.. రెండేళ్ల‌లోనే ప్రైవేటైజేషన్ పూర్తి చేసేస్తారని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్ర‌క్రియంలో ముందుగా.. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక న్యాయ నిపుణులను నియమిస్తుంది. వారు చర్చించిన తరువాత ఉద్యోగుల విలువ, ప్లాంట్ ఆస్తులు, ఇతర భూములు, యంత్రాలు, పనిముట్లు... ఇలా చిన్న మేకు నుంచి భారీ ఫర్నేసుల వరకు అన్నింటినీ విలువ కడతారు. ఆ తర్వాత కొనేందుకు ఆసక్తి చూపించే వారి నుంచి బిడ్డింగులను తీసుకుంటారు. ఎక్కువ కోట్ చేసిన వారికి ప్లాంట్‌ని అప్పగిస్తారు. దీంతో.. ప్రైవేటీక‌ర‌ణ పూర్త‌వుతుంది.

గ‌తేడాది నాటికి స్టీల్ ప్లాంట్ మీద‌ దాదాపు 11 వేల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఈ అప్పు, పెరుగుతున్న వ‌డ్డీని కార‌ణాలుగా చూపుతూ ప్ర‌భుత్వం ప్రైవేటీక‌ర‌ణ‌కు సిద్ధ‌మైంది. అయితే.. భవిష్యత్తులో ప్లాంట్ లాభాలు గడించే అవకాశాలున్నాయంటున్నారు నిపుణున‌లు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ నష్టాల్లోనే ఉన్నా... 2020 డిసెంబరు నెలలో 2,100 కోట్ల రూపాయల టర్నోవర్ తో 170 కోట్ల రూపాయల లాభాన్ని పొంద‌డం విశేషం. ఇవన్నీభ‌విష్య‌త్ లో సంస్థ లాభాల్లోకి రాబోతోంద‌న‌డానికి సానుకూల అంశాలే. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం అమ్మేయ‌డానికి సిద్ధ ప‌డ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌ని నిపుణులు ఆశ్చ‌ర్యం, ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.