Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కు ‘టాటా’ చేతిలోకి వెళ్లిపోనుందా?

By:  Tupaki Desk   |   18 Aug 2021 4:01 AM GMT
విశాఖ ఉక్కు ‘టాటా’ చేతిలోకి వెళ్లిపోనుందా?
X
ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు అని నినదించి మరీ పోరాడి సాధించుకున్న విశాఖఉక్కును ప్రైవేటు పరం చేయాలని మోడీ సర్కారు పట్టుదలతో ఉండటం తెలిసిందే. ఈ నిర్ణయం బయటకు వచ్చిన నాటి నుంచి విశాఖ ఉక్కు ఉద్యోగులు మొదలు ప్రతి తెలుగోడు.. కేంద్రంలోనిమోడీ సర్కారు నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. లాభాల్లో నడుస్తున్న విశాఖ ఉక్కును ప్రభుత్వం అమ్మకానికి పెట్టే ఆలోచనను విరమించాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. అయినప్పటికీ.. ఆ ఆందోళల్ని పట్టించుకోని మోడీ సర్కారు తన ప్రయత్నాలు తాను చేస్తున్నదే తప్పించి.. ఏపీ ప్రజల మనోభావాల్ని పట్టించుకోవాలని అస్సలు అనుకోవటం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. విపక్షాలతో సహా.. విశాఖ ఉక్కు ఉద్యోగులు పలువురు ఉద్యమ బాట పట్టటం తెలిసిందే. నిరసనలు.. ఆందోళనలు చేస్తున్నారు. విశాఖ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పటికే తన పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మొద్దంటూ కేంద్రానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాయటమే కాదు.. ప్రైవేటీకరించకుండానే ప్లాంట్ ను ఏ రీతిలో కాపాడుకోవచ్చన్న విషయాన్ని వివరిస్తూ ఆయన లేఖ రాయటం తెలిసిందే.

అయితే.. కేంద్రం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. తాము అనుకున్న ప్రైవేటీకరణను పూర్తి చేయాలన్నదే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.ఏపీ విపక్ష నేత చంద్రబాబు సైతం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించటం సరికాదన్నారు. చివరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం కేంద్రం తీరును తప్పు పట్టటమే కాదు.. పార్టీ అధినేత అనుమతితో భవిష్యత్తులో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కోసం ఆందోళన చేస్తామని చెప్పటం తెలిసిందే. ఈ మధ్యనే ముగిసిన పార్లమెంటు సమావేశాల్లోనూ విశాఖ ఉక్కునను ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్నిస్పష్టం చేయటం ద్వారా.. ప్రైవేటీకరణను ఆపే ప్రసక్తే లేదని మోడీ సర్కారు స్పష్టం చేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ కు సంబందించి ఒక ఆసక్తికరపరిణామం వెలుగు చూసింది. విశాఖ ఉక్కును సొంతం చేసుకోవటానికి టాటా సంస్థ ముందుకు వచ్చింది. కేంద్రం అనుసరిస్తున్న సంస్కరణలలో భాగంగా.. విశాఖ ఉక్కును తాము టేకోవర్ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని టాటా స్టీల్ చీఫ్ ఎగ్జిక్యూటివి ఆపీసర్ కమ్ ఎండీ టీవీ నరేంద్రన్.. ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విశాఖ ఉక్కు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. స్వయంగా టాటాలు సీన్లోకి దిగాక..వారి ఆసక్తిని మోడీ సర్కారు వద్దనే అవకాశం తక్కువని చెబుతున్నారు. ఓవైపు నిరసనల్ని పట్టించుకోని ప్రభుత్వం.. మరోవైపు టాటా నుంచి వచ్చిన ఆసక్తి నేపథ్యంలో.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కావటం మినహా మరో మార్గం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.